- న్యూ ఇయర్‌పై ఆటో ఇండస్ట్రీ
- ఫిబ్రవరిలో ఆటో ఎక్స్ పో అమ్మకాలు పెరుగుతాయని ఆశ
- అంతా కొత్త ఇన్వెంటరీనే అంటున్న సియామ్
న్యూఢిల్లీ :
స్లోడౌన్ తలనొప్పిని, బీఎస్ 4 నార్మ్స్‌ను వదిలించుకుని.. ఆటో ఇండస్ట్రీ కొత్త సంవత్సరంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టబోతోంది. కొత్త సంవత్సరంలో పరిస్థితి కుదుటపడుతుందని ఆటో ఇండస్ట్రీ ఆశిస్తోంది. న్యూ మోడల్స్, న్యూ లుక్‌తో అలరించాలనుకుంటోంది. స్లోడౌన్ నుంచి బయటికి వచ్చి అంచనాలకు అనుగుణంగా ఇండస్ట్రీ ఉంటుందని.. మళ్లీ ప్రజలు ఆటో షోరూంలకు వస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కొత్త సంవత్సరంలోనే బీఎస్ 4 నార్మ్స్ నుంచి బీఎస్ 6 ఎమిషన్ నార్మ్స్ లోకి ఆటో ఇండస్ట్రీ మారుతోంది.
ఇండియా ఫ్లాగ్‌షిప్ మోటార్ షో ‘బైనీయల్ ఆటో ఎక్స్’ ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు జరుగబోతుంది. ఈ ఆటో సెక్టార్‌పై కంపెనీలన్నీ దృష్టిసారించాయి. ఈ ఎక్స్‌పోలోనే కంపెనీలు కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌కి పరిచయం చేస్తున్నాయి. ఆటో ఇండస్ట్రీ రివైవల్ కోసం ఈ ఆటో ఎక్స్‌పో 2020 ఒక లాంచింగ్ ప్యాడ్‌గా ఉండబోతుందని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు.
2020 ఇంటరెస్టింగ్ ఇయర్…
టూవీలర్స్ నుంచి కార్లు, హెవీ డ్యూటీ ట్రక్స్ వరకు అన్ని సెగ్మెంట్లలో కూడా ఇప్పటి వరకు అమ్మకాలు లేక చతికిల పడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది హోల్‌సేల్‌లో 13 శాతం నుంచి 17 శాతం తగ్గుదలను ఇండస్ట్రీ నమోదు చేస్తుందని తెలుస్తోంది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చాలా కంపెనీలు కార్యకలాపాలు సాగించలేకపోతున్నాయి. ప్రొడక్షన్ కూడా తగ్గించాయి. ఈ డౌన్‌ట్రెండ్‌తో ఆటో సెక్టార్‌లోని డీలర్‌షిప్‌లు, ఆటో కాంపోనెంట్స్ వంటి వాటిల్లో పనిచేసే మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఆటో సెక్టార్ కొత్త సంవత్సరంపై కాస్త ఆశతో ఉంది. 2020–21లో కచ్చితంగా ఆటో సెక్టార్ కోలుకుంటుందని ఇండస్ట్రీ బాడీ సియామ్(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్) అంచనావేస్తోంది. 2020 చాలా ఇంటరెస్టింగ్ ఏడాదని, బీఎస్ 6 నార్మ్స్ అమలుతోపాటు, మార్కెట్‌లోకి చాలా కొత్త మోడల్స్ కొత్త సంవత్సరంలో రానున్నాయని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా అన్నారు.
మూడో క్వార్టర్ నాటికి ఫలితం కనిపిస్తది….
వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎకానమీ కూడా మెరుగవుతుందని అంచనాలొస్తున్నాయి. అంతేకాక ఆటో సెక్టార్ కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. దీంతో ఈ రంగం వృద్ధి సాధిస్తుందని వధేరా అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నుంచి ఈ రంగం రివైవ్ కావడం ప్రారంభిస్తుందని, కానీ మూడో క్వార్టర్‌లోనే దీని ఫలితం కనిపిస్తుందని చెప్పారు.
బీఎస్ 6 నార్మ్స్‌తో మార్కెట్‌లో ఉన్న పాత ఇన్వెంటరీ అంతా క్లీన్ అవుతుంది. కొత్త ఇన్వెంటరీతో కంపెనీలు వాహనదారుల ముందుంటాయి. ఈ కొత్త ఇన్వెంటరీ కోసం ప్రొడక్షన్ పెరుగుతోంది. టెక్నాలజీ మార్పులతో వెహికిల్స్ ఉత్పత్తి వ్యయం కూడా 8 శాతం నుంచి 10 శాతం పెరుగుతోంది. ఈ అదనపు ఖర్చులను భరించడం కోసం, వెహికిల్స్‌పై ఉన్న జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వధేరా కోరుతున్నారు. అలాగే ఇన్సెంటివ్ ఆధారిత స్క్రాపింగ్ పాలసీని తీసుకురావాలని అడుగుతున్నారు. ఈ రెండింటితో ఆటో సెక్టార్ త్వరగా కోలుకుంటుందని చెప్పారు.
ఆశాభావంతో ఉన్న ఇండస్ట్రీ దిగ్గజాలు..
వధేరాతో పాటు దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీఈవో, ఎండీ కెనిచి అయుకవ కూడా 2020పై ఆశాభావంతో ఉన్నారు. బీఎస్ 6 అమలు తర్వాత, వీటి గురించి కొన్ని నెలల్లో కస్టమర్లు అర్థం చేసుకుంటారని హుండై మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ కూడా చెప్పారు. దీంతో రెండో క్వార్టర్ నుంచి డిమాండ్ క్రమక్రమంగా పుంజుకుంటుందని తెలిపారు. ఎంత త్వరగా రికవరీ అవుతుందో చెప్పలేం కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం పరిస్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు.
బీఎస్ 6 నార్మ్స్‌లోకి మారడమే టాటా మోటార్స్‌కు అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పింది. తమ బీఎస్ 6 ప్రొడక్ట్‌లను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తామని సీఈవో, ఎండీ గుంటెర్ బట్స్‌చెక్ చెప్పారు.
మార్కెట్‌లోకి వస్తోన్న కొత్త వెహికిల్స్…
హుండై కోనా మాదిరి టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఈవీ త్వరలోనే రోడ్లపైకి వచ్చేందుకు చూస్తున్నాయి. మొత్తంమీద ఫిబ్రవరిలో జరుగబోయే ఎక్స్‌పోలో 60 కొత్త మోడల్స్ లాంచ్‌లు ఉండనున్నాయి. చైనా గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ, ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ లు కూడా ఇండియా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంజీ మోటార్స్ మన మార్కెట్‌లోకి వచ్చేసింది. ఫోక్స్‌వాగన్, స్కోడా బ్రాండ్లతో పాటు మారుతీ సుజుకి, హుండై, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, కియా వంటి కంపెనీలన్నీ ఈసారి షోలో పాల్గొంటున్నాయి.

