న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్లాగ్‌షిప్ షో ఆటో ఎక్స్‌పో –2023 బుధవారం గ్రేటర్ నోయిడాలో గ్రాండ్‌గా ఓపెన్ అయ్యింది. లోకల్, గ్లోబల్ కంపెనీలు తమ బండ్లను ప్రదర్శనకు ఉంచాయి. ఈసారి ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందడి చేశాయి. మారుతి సుజుకీ వంటి పెద్ద కంపెనీలు తమ కాన్సెప్ట్ కార్లను మీడియా ముందుకు తీసుకొచ్చాయి. గ్రాండ్ విటారా, ఎక్స్‌ఎల్6, సియాజ్, ఎర్టిగా, బ్రెజ్జా, వేగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి 16 మోడల్స్‌ను మారుతి ప్రదర్శనకు ఉంచింది. జేబీఎం, వీఈ కమర్షియల్ వెహికల్స్ తమ ఎలక్ట్రిక్ బస్సులను లాంచ్ చేయగా, చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ తమ లగ్జరీ సెడాన్‌లను లాంచ్ చేసింది.
హ్యుండాయ్ ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 ను బాలివుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రదర్శనకు ఉంచారు. ఈసారి ఈవెంట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, నిస్సాన్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పెద్ద కార్ల కంపెనీలు పార్టిసిపేట్ చేయడం లేదు. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హ్యుండాయ్, ఎంజీ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ వంటి కంపెనీలు ఆటో ఎక్స్‌పోను ముందుండి నడుపుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ షో, ప్రెస్ కోసం గురువారం వరకు ఓపెన్‌లో ఉంటుంది. శుక్రవారం నుంచి వచ్చే బుధవారం వరకు సాధారణ ప్రజల కోసం ఓపెన్‌లో ఉంటుంది.
బీవైడీ అట్టో 3 వచ్చేసింది
చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ అట్టో 3 మోడల్‌ను బుధవారం లాంచ్ చేసింది. అంతేకాకుండా బీవైడీ సీల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ ఏడాది చివరిలో ఈ లగ్జరీ సెడాన్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 1,200 అట్టో 3 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని, ధర రూ. 34.49 లక్షలని (ఎక్స్‌షోరూమ్) కంపెనీ పేర్కొంది. అట్టో 3 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని పేర్కొంది.
సుజుకీ కాన్సెప్ట్ కారు ఈవీఎక్స్
సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచింది. 2025 లో ఈ కారు మార్కెట్‌లోకి తీసుకురానుంది. సుజుకీ మోటార్ సబ్సిడరీ మారుతి సుజుకీ కూడా వివిధ మోడల్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ అయిన కాన్సెప్ట్ ఈవీఎక్స్‌లో 60 కిలో వాట్స్ హవర్ బ్యాటరీని అమర్చుతారు. ఫుల్ ఛార్జ్‌పై 550 కి.మీ వెళుతుందని అంచనా.
హ్యుండాయ్ ఐయోనిక్5 ధర రూ. 44.95 లక్షలు
ఎలక్ట్రిక్ మోడల్ ఐయోనిక్ 5 ను హ్యుండాయ్ మోటార్ ఇండియా ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసింది. ఈ వెహికల్ ధర రూ.44.95 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్ మోడల్‌ను ఇండియాలో అమ్ముతున్న ఈ కంపెనీ, ఐయోనిక్ 5 ను తాజాగా తీసుకొచ్చింది. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 631 కి.మీ వెళుతుందని కంపెనీ చెబుతోంది.
500 కిమీ వెళ్లే ఎలక్ట్రిక్ బస్సు..
కరెంట్‌తో నడిచే ఇంటర్ సిటీ బస్సును వీఈ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఈ బస్సు ఫుల్ ఛార్జ్‌పై 500 కి.మీ వరకు వెళుతుందని కంపెనీ పేర్కొంది. వోల్వో, ఐషర్ మోటార్స్ కు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ వీఈసీవీ. ఈ ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఐషర్ ప్రో 2049 ఎలక్ట్రిక్ 4.9టీ జీబీడబ్ల్యూ పేరుతో ఒక ట్రక్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. మరోవైపు ఐషర్ ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీతో నడిచే ఐషర్ ప్రో 8055 ట్రక్‌ను, వోల్వో ఎఫ్‌ఎం ఎల్‌ఎన్‌జీ 420 4ఇంటు2 ట్రాక్టర్‌ను ప్రదర్శనకు ఉంచాయి.
గ్రీవ్స్ కాటన్ నుంచి ఎలక్ట్రిక్ బండ్లు
గ్రీవ్స్ కాటన్ బుధవారం ఆటో ఎక్స్‌పోలో తమ ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లను ప్రదర్శించింది. ఆంపియర్ ప్రీమస్, ఆంపియర్ ఎన్‌ఎక్స్‌జీ, ఎన్‌ఎక్స్‌జీ పేర్లతో వివిధ ఎలక్ట్రిక్ టూవీలర్లను తీసుకొచ్చింది. త్రీ వీలర్ సెగ్మెంట్‌లో గ్రీవ్స్ ఈఎల్‌పీ ప్యాసెంజర్ వెహికల్‌ను, గ్రీవ్స్ ఏరో విజన్ కింద కార్గో వెహికల్‌ను ప్రదర్శించింది.
జేబీఎం ‘గెలాక్సీ’ లాంచ్
ఎలక్ట్రిక్ లగ్జరీ కోచ్ ‘గెలాక్సీ’ ని జేబీఎం లాంచ్ చేసింది. అంతేకాకుండా త్వరలో తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ స్కూల్ , సిటీ, స్టాఫ్ బస్సులను ప్రదర్శనకు ఉంచింది. గెలాక్సీ ధరను కంపెనీ ప్రకటించలేదు. ఈ లగ్జరీ కోచ్‌లో ఒకేసారి 45 మంది ప్యాసెంజర్లు ట్రావెల్ చేయడానికి వీలుంటుంది. ఈ బస్సులో ఎక్కువ డెన్సిటీ ఉన్న హై టెక్నాలజీ బ్యాటరీ వాడామని, రోజులో 1,000 కి.మీ వరకు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది.
అటుల్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు
త్రీ వీలర్లను తయారు చేసే అటుల్ ఆటో ఈవీ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయ్యింది. రెండు ఈవీ మోడల్స్‌ను ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసింది. అటుల్ ఆటో సబ్సిడరీ కంపెనీ అయిన అటుల్ గ్రీన్‌టెక్ మొబిలి పేరుతో ప్యాసెంజర్, ఎనర్జీ పేరుతో కార్గో వేరియంట్లను లాంచ్ చేసింది. వీటి ధరలను ప్రకటించలేదు. ఫుల్ ఛార్జ్‌పై ఎనర్జీ 195 కి.మీ, మొబిలి 110 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎంజీ హెక్టార్‌లో కొత్త వేరియంట్లు
హెక్టార్‌లో కొత్త జనరేషన్ వేరియంట్లను ఎంజీ మోటార్స్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. నెక్స్ట్ జెన్ హెక్టార్ ధరలు రూ. 14.72 లక్షల నుంచి రూ.22.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటాయి. ఈ ఎస్‌యూవీ ఐదు, ఆరు, ఏడు సీటర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
