ఆటోడ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

  • అడ్డుకొని పోలీస్​ స్టేషన్​కు తరలించిన పోలీసులు

బషీర్ బాగ్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్​యూనియన్ల జేఏసీ నిర్వహించిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం హిమాయత్ నగర్ ఏఐటీయూసీ ఆఫీస్​నుంచి ఆటో డ్రైవర్లు ర్యాలీగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

జేఏసీ కన్వీనర్​బి.వెంకటేశం మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.  ఓలా, రాపిడో బైక్ టాక్సీ, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, పలువురు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 

ప్రభుత్వం స్పందించి ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. పొన్నం ప్రభాకర్ ఆరు నెలలుగా చర్చల పేరిట కాలయాపన చేయడం దుర్మార్గమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని వెంకటేశం హెచ్చరించారు. అరెస్ట్​అయిన వారిలో వెంకటేశంతోపాటు జేఏసీ నేతలు ఎంఏ సలీం, ఎండీ నజీర్, వి.మారయ్య, ఎస్.రాంకిషన్, ఎ.సత్తిరెడ్డి, వి.ప్రవీణ్, ఎ.భిక్షపతి యాదవ్, సీహెచ్ జంగయ్య ఉన్నారు.