కడప జిల్లా: తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండికోట రిజర్వాయర్ లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో మకాం వేసి గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారు రెవిన్యూ అధికారులు. పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో తాళ్ల ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్వాసితులు ఒప్పుకోకపోవడంతో పోలీసుల ప్రమేయంతో నిర్వాసితులను ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు అధికారులు. దీంతో అధికారులు, పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు నిర్వాసితులు. పరిహారం పూర్తిగా చెల్లించాకే ఖాళీ చేస్తామంటూ తెగేసి చెబుతున్నారు నిర్వాసితులు.
