గ్రేటర్లో మురుగునీటి సమస్యలకు చెక్.. 25 ఏండ్ల ముందుచూపుతో సీవరేజీ మాస్టర్​ప్లాన్

  • 2.50 కోట్ల మంది జనాభాకు తగ్గట్టు ప్రణాళికలు
  • 3,716 ఎంఎల్​డీ కెపాసిటీతో 39 ఎస్టీపీల నిర్మాణం

హైదరాబాద్​సిటీ, వెలుగు:ఔటర్​రింగ్​రోడ్​వరకూ విస్తరిస్తున్న గ్రేటర్​సిటీకి భవిష్యత్​లో మురుగునీటి సమస్య రాకుండా అధికారులు ఇప్పటి నుంచే ప్లాన్లు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన 25 సీవరేజీ ట్రీట్​మెంట్​ప్లాంట్లకు అదనంగా మరిన్ని ఎస్టీపీలను నిర్మించేందుకు అడుగులు వేస్తున్నారు. 

2021 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్​హైదరాబాద్​లో కోటి34లక్షల88వేల మంది జనాభా ఉన్నారు. ఈ సంఖ్య 2036 నాటికి కోటి94లక్షల6వేలకు, 2051 నాటికి 2కోట్ల 56లక్షల12వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

అందుకు అనుగుణంగా ఇప్పటికే కాంప్రహెన్సివ్​సీవరేజీ మాస్టర్​ప్లాన్​(సీఎస్ఎంపీ) సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను పెద్ద సంఖ్యలో నిర్మిస్తేనే పెరగబోయే జనాభా అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

25 ఏండ్ల తర్వాత 3,716 ఎంఎల్డీల మురుగు

ప్రస్తుతం బల్దియా పరిధిలో 1,650 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతోంది. అయితే సిటీలోని 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 878 ఎంఎల్డీలు వివిధ మార్గాల ద్వారా మూసీలో కలుస్తోంది. 

ఈ లెక్కన 2036 నాటికి 2,815 ఎంఎల్డీలు, 2051 నాటికి 3,716 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో వచ్చే మురుగుకు ప్రస్తుతమున్న ఎస్టీపీలు సరిపోవు. కాబట్టి మరో 39 ఎస్టీపీలను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. 

మూడు ప్యాకేజీలుగా..

మొదటి ప్యాకేజీలో భాగంగా 1,230.21 కోట్ల వ్యయంతో ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్​లో 8 ఎస్టీపీలను, రెండో ప్యాకేజీలో రాజేంద్రనగర్​, ఎల్బీనగర్​సర్కిళ్ల పరిధిలో1,355.15 కోట్లతో 4 ఎస్టీపీలను నిర్మిస్తోంది. 

మూడో ప్యాకేజీ కింద కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో 1,280.87 కోట్లతో 14 ఎస్టీపీలను, మిగిలిన ఎంపిక చేసిన ప్రాంతాల్లో మరికొన్నింటిని కలిపి మొత్తం 39 ఎస్టీపీలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఇవన్నీ పూర్తయితే 2051 నాటికి గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో ఉత్పత్తి అయ్యే 3,716 ఎంఎల్డీల మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.