IND vs AUS: సిడ్నీ టెస్టులో చిత్తుగా ఓడిన భారత్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి ఔట్

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మూడో రోజు సునాయాసంగా ఛేజ్ చేసింది. ఓపెనర్ ఖవాజా(41), హెడ్ (35), వెబ్ స్టర్ (30) బ్యాటింగ్ లో రాణించడంతో 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ తో పాటు 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను కంగారూల జట్టు 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి టెస్ట్ భారత్ గెలవగా.. ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో జయభేరి మోగించింది. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్ట్ డ్రా గా ముగిసింది.    

ఈ విజయంతో ఇంగ్లాండ్ లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు ఆసీస్ అధికారికంగా అర్హత సాధించింది. సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. మరోవైపు ఈ ఓటమితో భారత్ అధికారికంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించింది.  పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం విశేషం. చివరిసారిగా 2014-15 లో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. 

రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. మరో 16 పరుగులకు చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ 6 వికెట్లు తీసి భారత్ ను దెబ్బ కొట్టాడు. 162 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ కు తొలి వికెట్ కు ఓపెనర్లు 39 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే స్వల్ప వ్యవధిలో ఆ జట్టు మూడు వికెట్ల కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. 

Also Read :- నా దగ్గర ఏమీ లేదు.. ఎగతాళి చేసిన కోహ్లీ

ఈ దశలో ఓపెనర్ ఖవాజా, ట్రావిస్ హెడ్ 46 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. ఖవాజా ఔటైనా.. వెబ్ స్టర్, హెడ్ జాగ్రత్తగా భారత్ కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణకు మూడు వికెట్లు దక్కాయి. గాయం కారణంగా మూడో రోజు బుమ్రా బౌలింగ్ కు రాకపోవడం టీమిండియా ఓటమిపై ప్రభావం చూపించింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది.