AUS vs PAK 2024: కమ్మిన్స్‌కే ఇలాంటివి సాధ్యం: ఓడిపోయే మ్యాచ్ గెలిపించిన ఆసీస్ కెప్టెన్

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కు తెలిసినంత మరెవరికీ తెలియదేమో. జట్టు ఓడిపోతున్నప్పుడల్లా బాధ్యతగా ఆడుతూ తమ జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఫాస్ట్ బౌలర్ గా పేరున్నప్పటికీ.. జట్టుకు అవసరమైనప్పుడల్లా సత్తా చాటతాడు. తాజాగా పాకిస్థాన్ తో జరిగిన తొలి వన్డేలోనూ కమ్మిన్స్ తీవ్ర ఒత్తిడిలో ఆసీస్ కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. 8 వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో ఉన్నప్పుడు 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.    

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో సోమవారం (నవంబర్ 4) ముగిసిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 204 పరుగుల ఓ మాదిరి లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా ఒకదశలో 183 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కమ్మిన్స్ జాగ్రత్తగా ఆడుతూ పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. కమ్మిన్స్ తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడడం ఆసీస్ కెప్టెన్ కు కొత్తేమి కాదు. వరల్డ్ కప్ 2023.. యాషెస్ 2023లోనూ కమ్మిన్స్ తీవ్ర ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. 44 పరుగులు చేసిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బౌలర్ నజీమ్ షా 40 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 200 పరుగులు దాటించాడు. 37 పరుగులు చేసి బాబర్ అజామ్ పర్వాలేదనిపించాడు. 204 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి గెలిచింది.