IND vs AUS: సమిష్టిగా రాణించిన బౌలర్లు.. టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కోసం కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కంగారూల జట్టును ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేసింది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. షార్జా లాంటి స్లో పిచ్ లపై భారత్ ఈ టార్గెట్ ఛేజ్ చేయాలంటే సవాలుతో కూడుకున్నది. 40 పరుగులు చేసిన ఓపెనర్ గ్రేస్ హారిస్ టాప్ స్కోరర్ గా నిలిచింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకునే ఆసీస్ కు మంచి ఆరంభం దక్కలేదు. భారత ఫాస్ట్ బౌలర్ రేణుక ఠాకూర్ ధాటికి 17 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. మూనీ(2), వారెహామ్(0) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ దశలో హారిస్, తాత్కాలిక కెప్టెన్ తహిలా మెగ్రాత్ (32) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియా క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వస్తుంది. ఒక వైపు పెర్రీ (32) క్రీజ్ లో ఉన్న ఆమెకు సహకరించే వారు ఎవరూ లేరు. 

చివర్లో ఫోబ్ లిచ్ఫీల్డ్, సదర్లాండ్ కొన్ని మెరుపులు మెరిపించడంతో ఆసీస్ స్కోర్ 150 పరుగుల మార్క్ టచ్ చేసింది. భారత బౌలర్లలో రేణుక ఠాకూర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకార్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.