వర్షం వచ్చి వెలిసినప్పుడు ఆకాశం ఏడు రంగుల వంకీని వయ్యారంగా పెడతది. దాన్నే మనం హరివిల్లు అలియాస్ ఇంద్రధనుస్సు అంటాం. ఇంగ్లిష్లో అయితే రెయిన్బో అంటాం. పేరు ఏదైతేనేం, అదే ఆకాశంలో ఓ విమానం హరివిల్లును అల్లితే ఎట్లుంటది? ఇదిగో ఈ ఫొటోలో చూపించినట్టు ఉంటుంది. అవును, ఇది నిజమే. విమానం వెళుతున్నప్పుడు దాని వెనకాల వచ్చిన ఇంద్ర ధనుస్సిది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన మైకేల్ మార్స్టన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ హరివిల్లు విమానాన్ని తన కెమెరాలో పట్టేశాడు.
ఆకాశంలో ఖతార్ విమానం దూసుకెళుతుండగా ఈ ఏడాది జూన్లో దాన్ని ఒడిసిపట్టాడు. ఇంతకుముందూ ఇలాంటి ఫొటోలు అతడు తీసినా, వీడియో కూడా తీయడం ఇదే మొదటిసారి. విమానాలు అత్యంత ఎత్తులో వెళుతున్నప్పుడు ఒత్తిడి (పీడనం) తగ్గుతుందని, గాలిలో వేడి పడిపోతుందని, అప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయని జర్మన్ ఏరోస్పేస్ సెంటర్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆప్ అట్మాస్ఫెరిక్ సెంటర్ సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే, నాసా సైంటిస్టులు దానికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. విమానం ఎగ్జాస్ట్ (పొగ గొట్టాలు) నుంచి పొగ బయటకు వచ్చినప్పుడు చల్లటి గాలి ఏర్పడి మంచు స్ఫటికాలు పుడతాయని, ఆ స్ఫటికాలపై సూర్యుడి వెలుగు కరెక్ట్ కోణంలో పడితే ఇలాంటి హరివిల్లులు ఏర్పడతాయని వాళ్లు చెబుతున్నారు.
