IND vs AUS: తొలి సెషన్ లో సిరాజ్ పంజా.. విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్

పెర్త్ టెస్టులో భారత్ విజయానికి దగ్గరలో ఉంది. మరో 5 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచినట్టే. నాలుగో రోజు ఉదయం సిరాజ్ రెండు కీలక వికెట్లు తీయడంతో టీమిండియా ఆసీస్ పై  తొలి టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రావిస్ హెడ్ (63), మిచెల్ మార్ష్ (7) ఉన్నారు. ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 430 పరుగులు చేయాలి. మరోవైపు భారత్ 5 వికెట్లు తీస్తే చాలు. 

3 వికెట్ల నష్టానికి 12 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ కు ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బిగ్ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన బంతితో ఖవాజాను ఔట్ చేసి భారత్ కు శుభారంభం ఇచ్చాడు. ఈ దశలో స్మిత్ తో కలిసిన హెడ్ భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. 19 ఓవర్ల పాటు అడ్డుకొని టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే ఎట్టకేలకు లంచ్ సమయానికి ముందు సిరాజ్ స్మిత్ ను ఒక ఔట్ స్వింగ్ తో ఔట్ చేశాడు. ఈ వికెట్ భారత్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. హాఫ్ సెంచరీ చేసి భారత జోరును అడ్డుకున్నాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.  రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.