IND vs AUS: హెడ్, లబుషేన్ హాఫ్ సెంచరీలు.. ఆధిక్యంలోకి వెళ్లిన ఆస్ట్రేలియా

అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. రెండో రోజు ఆటలో భాగంగా ఆతిధ్య ఆసీస్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సెషన్ లో భారత్ మూడు కీలక వికెట్లు సంపాదించినా.. మ్యాచ్ మాత్రం కంగారూల వైపే ఉంది. హెడ్, లబుషేన్ హాఫ్ సెంచరీలు చేయడంతో రెండో రోజు డిన్నర్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రావిస్ హెడ్ (53), మిచెల్ మార్ష్ (2) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.

వికెట్ నష్టానికి 86 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా ప్రారంభంలో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(39) వికెట్ ను కోల్పోయింది. బుమ్రా వేసిన అద్భుత బంతికి వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ తో స్టీవ్ స్మిత్ ను బుమ్రా మరోసారి బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబుషేన్, హెడ్ భారత బౌలర్లపై ఎటాకింగ్ గేమ్ ఆడారు. నాలుగు వికెట్ కు వేగంగా 65 పరుగులు జోడించారు. 

Also Read:-తెలుగు కుర్రాడు సూపర్ డెలివరీ.. కీలక వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నితీష్

ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి భారత బౌలర్ల సహనాన్ని గంటలపాటు పరీక్షించిన మార్నస్ లబుషేన్ (64) వికెట్ తీసుకొని టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. నితీష్ రెడ్డికి ఒక వికెట్ లభించింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయింది.

42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ (0), కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) విఫలమయ్యారు. రాహుల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. గిల్ 31 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. బోలాండ్ 3 వికెట్లు.. కమ్మిన్స్ కు రెండు వికెట్లు లభించాయి.