AUS vs IND: భారత్‌ను దెబ్బ కొట్టిన స్టార్క్.. తొలి సెషన్ ఆసీస్‌దే

అడిలైడ్ టెస్టులో భారత్ కు మంచి ఆరంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆతిధ్య ఆస్ట్రేలియాపై తొలి సెషన్ లో తడబడ్డారు. డిన్నర్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ(1) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా.. బోలాండ్ కు ఒక వికెట్ దక్కింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలి బంతికే వికెట్ ను కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే జైశ్వాల్ ఔటయ్యాడు. ఈ దశలో రాహుల్, గిల్ భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూ కుదిరినప్పుడల్లా ఫోర్ కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ దశలో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. 

స్టార్క్ వేసిన ఎక్స్ట్రా బౌన్సర్ ను ఆడే క్రమంలో రాహుల్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఒక ఫోర్ కొట్టిన కోహ్లీ.. రాహుల్ ఔటైన   తరహాలోనే పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు స్టార్క్ దక్కించుకున్నాడు. మరో 10 నిమిషాల్లో డిన్నర్ కు వెళ్తారన్న సమయంలో ఆసీస్ పేసర్ బోలాండ్ బౌలింగ్ లో గిల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో వికెట్ నష్టానికి 69 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. 81 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.