IND vs AUS: మ్యాచ్ మన చేతుల్లోనే: ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. భారత్ ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన సంతోషం ఆస్ట్రేలియాకు కాసేపైనా మిగలలేదు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఆతిధ్య ఆసీస్ జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.  7 వికెట్లకు 67 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు 37 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల విలువైన భాగస్వామ్యం సంపాదించింది.

రెండో రోజు ఆట ప్రారంభంలో క్యారీ (21) , లియాన్(5) త్వరగానే ఔటయ్యారు. భారత బౌలర్లు చివరి వికెట్ తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. స్టార్క్ (26) జోష్ హాజిల్‌వుడ్ (7) చివరి వికెట్ లు 25 పరుగులు జోడించారు. వీరిద్దరూ పట్టుదల చూపించడంతో ఆస్ట్రేలియా 100 పరుగుల మార్క్ దాటింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రానాకు మూడు వికెట్లు దక్కాయి. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్న ఈ మ్యాచ్ లో మూడు రోజుల్లోనే ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుంది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు.