AUS Vs PAK: 8,0,3,4,4,0: 24 పరుగులకే 6 వికెట్లు.. ఆసీస్ పేసర్ల ధాటికి క్యూ కట్టిన పాక్ ఆటగాళ్లు

గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 పాకిస్థాన్ ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. వచ్చామా వెళ్ళామా అనేట్టు వీరి ఆట సాగింది. వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 94 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ పేసర్ల విజృంభించడంతో  పాకిస్థాన్ ఒకదశలో 24 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

తొలి ఓవర్ మొదటి రెండు బంతులకు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన సాహిబ్జాదా ఫర్హాన్.. మూడో బంతికి జాన్సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. జేవియర్ బార్ట్‌లెట్ రెండో ఓవర్లో కెప్టెన్ రిజ్వాన్ తో పాటు ఉస్మాన్ ఖాన్‌ ను పెవిలియన్ కు పంపాడు. నాథన్ ఎల్లిస్ వేసిన నాలుగో ఓవర్లో బాబర్ ఆజం, ఇర్ఫాన్ ఖాన్ ఔట్ కావడంతో పాకిస్థాన్ 16 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో నిలిచింది. నాలుగో ఓవర్లో ఆఘా సల్మాన్‌ ఔట్ కావడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. ఈ ఆరుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 

చివర్లో అబ్బాస్ అఫ్రిది 20 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత 7 ఓవర్లలో 64 పరుగులు చేసి 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 93 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 19 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. స్టోయినీస్ 7 బంతుల్లోనే 21 పరుగులు చేసి వేగంగా ఆడాడు.