SL vs AUS: కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్.. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ దక్కింది. శ్రీలంకతో జనవరి 29న ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వలన రెగ్యులర్ కెప్టెన్ కమ్మిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించిన కమ్మిన్స్.. అతని భార్య డెలివరీ కారణంగా శ్రీలంకతో సిరీస్ కు దూరంగా ఉంటున్నాడు. ట్రావిస్ హెడ్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

ఆస్ట్రేలియా అండర్19 క్రికెట్ ప్రపంచ కప్ మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీ తొలిసారి టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకలో జరగబోయే ఈ సిరీస్ కు స్పిన్నర్లు కీలకం కానుండడంతో మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టులకు దూరమైన యువ ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీకి స్క్వాడ్ లో చోటు దక్కింది. భారత్ తో సిరీస్ లో గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. 

జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు తొలి టెస్ట్.. ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 10 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. రెండు టెస్టులు గాలే వేదిక కానుంది. ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అర్హత సాధించడంతో ఈ సిరీస్ నామమాత్రంగా మారింది. 

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, మచ్‌స్వీనీ, టోడ్‌స్వీనీ, , బ్యూ వెబ్‌స్టర్