AUS vs IND: ప్రాక్టీస్ మ్యాచ్‌లు దండగ: వరుసగా రెండో టెస్టులోనూ ఆసీస్‌పై భారత్ ఓటమి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ లను ఉపయోగించుకోలేకపోయింది. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ సెంచరీ.. రెండో టెస్టులో ధృవ్ జురెల్ రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు మినహాయిస్తే ఈ టూర్ లో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం (నవంబర్ 9) ముగిసిన రెండవ అనధికారిక టెస్ట్ లో ఆస్ట్రేలియా.. భారత్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

భారత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. సామ్ కాన్స్టాస్(73), వెబ్ స్టర్(46) భాగస్వామ్యంతో ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటై.. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 229 పరుగులకు ఆలౌట్ కాగా.. 169 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా  నాలుగు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.       

ALSO READ : Sanju Samson: సఫారీలపై వీరోచిత శతకం.. శాంసన్ ఖాతాలో 7 రికార్డులు

అంతకముందు భారత్ తొలి టెస్టులో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 2-0 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ గెలుచుకుంది. ఈ  సిరీస్ లో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసిన ధృవ్ జురెల్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం కనిపిస్తుంది. బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన ప్రసిద్ కృష్ణకు ఛాన్స్ దక్కొచ్చు. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.