మకే : ఆస్ట్రేలియా–ఎ జట్టుతో తొలి అనధికార టెస్టులో ఇండియా–ఎ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియా ఇచ్చిన 225 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ మూడే వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. కెప్టెన్ నేథన్ మెక్‌స్వీనీ (88 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్ (61 నాటౌట్) జట్టును గెలిపించారు. ఓవర్‌నైట్ స్కోరు 139/3తో ఆసీస్ నాలుగో రోజు, ఆదివారం ఛేజింగ్ కొనసాగించింది. అయితే, మూడో రోజు ఉపయోగించినది కాకుండా మరో బాల్ ఇచ్చిన అంపైర్లతో ఇండియా ప్లేయర్లు వాగ్వాదానికి దిగారు.
స్క్రాచెస్ రావడంతో బాల్‌ను మార్చినట్లు అంపైర్ చెప్పగా.. ఇది చెత్త నిర్ణయం అని కీపర్ ఇషాన్ కిషన్ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్య చేసినందుకు కిషన్‌పై ఫిర్యాదు చేస్తామని ఫీల్డ్ అంపైర్ చెప్పాడు. అయితే, బంతి దెబ్బతినడంతోనే దాన్ని మార్చినట్టు ఆట ముగిసిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దాంతో ఇషాన్‌పై ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 7 నుంచి జరుగుతుంది.