IND vs AUS 3rd Test: ముగిసిన రెండో రోజు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్

బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో భారత బౌలర్లు విఫలమయ్యారు. బుమ్రా మినహాయిస్తే ఏ ఒక్కరు ప్రభావం చూపించలేకపోయారు. మరో వైపు ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. 

అలెక్స్ క్యారీ (43), స్టార్క్ (2) క్రీజ్ లో ఉన్నారు. 3 వికెట్ల నష్టానికి 234 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. హెడ్, స్మిత్ ఇద్దరూ బ్యాట్ ఝళిపించడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో స్మిత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. కొత్త బంతితో స్మిత్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇదే ఊపులో మిచెల్ మార్ష్ (5).. సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (152) వికెట్లు పడగొట్టడంతో భారత్ మ్యాచ్ లోకి వచ్చింది. 

Also Read:-ఒక్కడే వారియర్‌లా: బ్రిస్బేన్ టెస్టులో బుమ్రాకు 5 వికెట్లు..

ఈ దశలో కమ్మిన్స్(20), స్టార్క్(7*) లతో కలిసి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ స్వల్ప భాగస్వామ్యాలను నెలకొల్పాడు. దీంతో రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయట పడింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.