భారీగా తగ్గిన ఆసీస్ పేసర్ స్టార్క్ ధర.. ఏకంగా రూ.13 కోట్లు ఢమాల్

ఐపీఎల్-2025 సీజన్  కోసం ఆటగాళ్ల మెగా వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ ఆక్షన్ కొనసాగుతోంది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గత సీజన్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. 

రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‎తో ఆక్షన్‎లోకి వచ్చిన మిచెల్ స్టార్క్‎ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్ల తక్కువ ధరకే దక్కించుకుంది. స్టార్క్ కోసం ఆర్సీబీ, కేకేఆర్ పోటీ పడగా.. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసీస్ పేసర్‎ను కైవసం చేసుకుంది. దీంతో మిచెల్ స్టార్క్ వేతనంలో భారీ కోత పడింది. గత సీజన్‎లో రూ.24.75 కోట్లకు కేకేఆర్ స్టార్క్‎ను కొనుగోలు చేయగా.. నెక్ట్స్ సీజన్ కోసం స్టార్క్‎ను ఢిల్లీ రూ.11.75 కోట్ల తక్కువ ధరకే కొనుగోలు చేసింది.

గత సీజన్‎తో పోలిస్తే నెక్ట్స్ ఎడిషన్‎కు స్టార్క్ ఏకంగా రూ.13 కోట్లు కోల్పోయాడు. స్టార్క్ ధర దాదాపు 50 శాతానికి పైగా తగ్గింది. గత సీజన్‎లో ఐపీఎల్‎లోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచిన స్టార్క్.. అంచనాల మేర రాణించలేదు. సీజన్ ఫస్టాఫ్‎లో పూర్తిగా తేలియిపోయిన స్టార్క్.. చివర్లో కాస్త రాణించాడు. నెక్ట్స్ సీజన్‎కు స్టార్క్‎పై నమ్మకం వదులుకున్న కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలానికి వదిలేసింది. దీంతో స్టార్క్ మెగా వేలంలోకి వచ్చాడు. ఆక్షన్‎లో కూడా స్టార్క్ కోసం ప్రాంచైజ్‎లు పెద్దగా ఆసక్తి చూపలేదు.