AUS vs PAK: నిప్పులు చెరిగిన రౌఫ్‌.. ఆస్ట్రేలియాపై పాక్‌ భారీ విజయం

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఎట్టకేలకు గాడిలో పడ్డారు. తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నారు. శుక్రవారం(నవంబర్ 08) అడిలైడ్‌ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. 

గంటకు 145కి.మీ వేగంతో బౌన్సర్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ను మొదట షాహీన్ షా ఆఫ్రిది దెబ్బకొట్టాడు. ఓపెనర్లు ఫ్రేజర్-మెక్‌గుర్క్(13), మాథ్యూ షార్ట్(19) పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేర్చాడు. అక్కడినుంచి హారిస్ రౌఫ్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. గంటకు 145కి.మీ వేగంతో పదునైన బౌన్సర్లు విసురుతూ ఆసీస్ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. ఆ బౌన్సర్లను ఎదుర్కోలేక ఆసీస్ వీరులు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్మిత్(35), ఇంగ్లిస్(18), లబుచానే(6), ఆరోన్ హార్డీ(14), మ్యాక్స్‌వెల్(16).. ఇలా టాప్ బ్యాటర్లందరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. 

Also Read:-'ఫ్రీ'గా ఇలా చూసేయండి...

విసిగించిన జంపా

బౌన్సర్లను ఎదుర్కోలేక ఆసీస్ స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కడితే, ఆ జట్టు స్పిన్నర్ ఆడం జంపా మాత్రం పాక్ బౌలర్లను విసిగించాడు. వికెట్ ఇవ్వకుండా నసీమ్ షా, హస్నైన్, రౌఫ్‌ల సహనాన్ని పరీక్షించాడు. సిక్స్, ఫోర్ సాయంతో 18 పరుగులు చేసిన ఈ స్పిన్నర్.. జట్టు స్కోరు 150 పరుగులు దాటడంతో సహాయపడ్డాడు. మొత్తానికి ఆసీస్ 35 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

అయూబ్‌ మెరుపులు

అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ ఓపెనర్లు ఆడుతూపాడుతూ చేధించారు. పాక్‌ కేవలం ఒక వికెట్‌ నష్టపోయి 26.3 ఓవర్లలోనే మ్యాచ్  ముగించింది. ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌(82; 71 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్‌ (69 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో పాక్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఈ ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే నవంబర్‌ 10న పెర్త్‌ వేదికగా జరుగనుంది.