- ఓపెనర్లుగా యశస్వి, రాహుల్
- మిడిలార్డర్‌లో రోహిత్, గిల్
- ఉ. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
అడిలైడ్: తొలి టెస్ట్‌లో భారీ విజయంతో ఊపుమీదున్న టీమిండియా.. ఆస్ట్రేలియాతో పింక్ పరీక్షకు రెడీ అయ్యింది. నేటి నుంచి జరిగే ఈ డేనైట్ (రెండో) టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా రోహిత్‌సేన బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో 2–0తో ముందంజ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే టైమ్‌లో ఆడిన 12 పింక్ బాల్ టెస్ట్‌ల్లో కేవలం ఒకే ఒక్కదాంట్లో ఓడిన ఆసీస్ అదే రికార్డును, ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. తద్వారా తొలి టెస్ట్‌లో ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవడంతో పాటు సిరీస్‌ను సమం చేయాలని లెక్కలు వేస్తోంది. దీంతో హోరాహోరీగా సాగే ‘పింక్’ పరీక్షలో పాస్ అయ్యేదెవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఐదో స్థానంలో రోహిత్!
ఈ మ్యాచ్‌లో ఆడే టీమిండియా లైనప్‌ను చూస్తే చాలా బలంగా కనిపిస్తోంది. అయితే ఎవరు ఎక్కడ ఆడతారనే దానిపై కొద్దిగా క్లారిటీ వచ్చినా హిట్‌మ్యాన్ ప్లేస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. జట్టు ప్రయోజనాల మేరకు మిడిలార్డర్‌లో ఆడతానని రోహిత్ సంకేతాలిచ్చినా కచ్చితమైన స్థానాన్ని వెల్లడించలేదు. గత టూర్‌లో ఇదే అడిలైడ్ పిచ్‌పై టీమిండియా 36 రన్స్‌కే బొక్కబోర్లా పడింది. దీంతో ఈసారి అలాంటి రిజల్ట్ రావొద్దనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ను బలోపేతం చేశారు. అయితే పింక్ బాల్‌తో డేనైట్ టెస్ట్ ఆడటం మామూలుగా ఉండదు.
ప్రతిక్షణం ఏదో రకంగా సవాల్ ఎదురవుతూనే ఉంటుంది. 2019 తర్వాత రోహిత్ మిడిలార్డర్‌లో ఆడిన దాఖలాల్లేవు. ఆసీస్‌లో కంగారూల బౌలర్లను ఎదుర్కోవడంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా మొత్తానికే మోసం వస్తుంది. ఓపెనర్లుగా రాహుల్, యశస్విని కంటిన్యూ చేయనున్నారు. వన్‌డౌన్‌లో గిల్, ఆ తర్వాతి ప్లేస్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రావొచ్చు. ఇదే జరిగితే రోహిత్ ఐదో ప్లేస్‌లో ఆడే చాన్స్ ఉంది. ధ్రువ్ జురెల్, పడిక్కల్ ప్లేస్‌లో రోహిత్, గిల్ జట్టులోకి వచ్చారు. బౌలింగ్‌లో నలుగురు పేసర్లు, ఒక్క స్పిన్నర్ ఫార్ములానే ఉపయోగిస్తున్నారు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఏకైక ఆల్‌రౌండర్ స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఆడించనున్నారు.
బోలాండ్‌కు చాన్స్..
ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన పేసర్ హాజిల్‌వుడ్ ప్లేస్‌లో స్కాట్ బోలాండ్‌ను తీసుకున్నారు. ఇది మినహా మిగతా జట్టును కంటిన్యూ చేస్తున్నారు. అయితే 18 నెలల తర్వాత తొలి టెస్ట్ ఆడబోతున్న బోలాండ్ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఖవాజ, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్‌పై బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. హెడ్, మార్ష్ మిడిల్ బాధ్యతలు మోయనున్నారు. బౌలింగ్‌లో కమిన్స్, స్టార్క్‌పై భారీ ఆశలు ఉన్నాయి. స్పిన్నర్ లైయన్ ప్రభావం చూపొచ్చు.
తుది జట్లు
ఇండియా: రోహిత్ (కెప్టెన్), రాహుల్, యశస్వి, గిల్, కోహ్లీ, రిషబ్ పంత్, సుందర్, నితీశ్, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజ, నేథన్ మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, స్టార్క్, నేథన్ లైయన్, స్కాట్ బోలాండ్