IND vs AUS: ఆహా ఎంత మంచోళ్లు.. గొడవను పరిష్కరించుకున్న సిరాజ్ - హెడ్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్సాహం చూపిన విషయం విదితమే. మొదట మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరేసిన సిరాజ్.. అనంతరం ట్రావిస్ హెడ్ పై మాటలు తూలాడు. ఔట్ చేసిన ఆనందంలో హెడ్‌కు ఆవేశపూరిత సెండ్-ఆఫ్ ఇచ్చాడు. ఆడింది చాలు.. ఛల్ పో బే పో అన్నట్లు సైగలు చేశాడు. అందుకు హెడ్ అదే రీతిలో బదులిచ్చాడు. ఈ ఘటన తీవ్ర వివాదస్పదమైంది. 

హెడ్‌పై నోరు పారేసుకుని సిరాజ్.. ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో విలన్‌గా మారాడు. అంతేకాదు, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం సిరాజ్ తీరును తప్పుబట్టారు. స్లెడ్జింగ్ చేయడానికి పరిమితులు ఉంటాయని.. వాటిలో లోబడే ప్రవర్తించాలని భారత పేసర్ కు సర్ది చెప్పారు. మొత్తానికి చూస్తుంటే, ఈ గొడవ సర్దు మరిగినట్లే కనిపిస్తోంది. మూడో రోజు ఆటలో సిరాజ్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నన్ను అనొద్దు.. నిన్ను అనను!

మూడో రోజు ఆటలో సిరాజ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రాగా.. ఆ సమయంలో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ అతనితో ఏదో సంభాషించాడు. దాంతో, గతంలో ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని పరిష్కరించుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాబోవు ఐపీఎల్ లో సిరాజ్ నోటి దూలకు హెడ్ తప్పక బదులిస్తాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | IND vs AUS: అచ్చిరాని ఆదివారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఒకేరోజు రెండు ఓటములు

ఇక రెండో టెస్టు విషయానికొస్తే.. పింక్‌బాల్ పోరులో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 175 పరుగుల వద్ద అలౌటై.. కమ్మిన్స్ జట్టుకు 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ టార్గెట్‌ను ఆసీస్‌ వికెట్లేమీ నష్టపోకుండా 20 బంతుల్లోనే చేధించింది.