హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లు తయారు చేసే హైదరాబాద్ స్టార్టప్ ‘ఆటమ్ మొబైల్’ కు చెందిన కొత్త బైక్ ‘ఆటమ్ వేడర్’ కు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫికేషన్ దక్కింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్‌ను టెస్టింగ్ చేసి, వాటికి సర్టిఫికెట్‌ను ఈ సంస్థ ఇష్యూ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ను విదేశాల్లో కూడా అంగీకరిస్తారు. వేడర్‌ను ఈ ఏడాదే రోడ్లపైకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త కేఫ్ రేసర్ మోడల్‌లో 2.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, పటిష్టమైన ట్యూబులర్ ఛాసిస్, ఎల్ఈడీ ఇండికేటర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ నడుస్తుంది. మాగ్జిమమ్ స్పీడ్ 65 కిలోమీటర్లు. దీనికి గేర్లు, క్లచ్, లెగ్ బ్రేక్ ఉండవు. వేడర్ బైక్‌లను పటాన్‌చెరులోని కంపెనీ నెట్ జీరో ఫెసిలిటీలో తయారు చేస్తున్నారు. ఇటీవల దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 25,000 యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్లకు పెంచారు. ఈ ఫ్యాక్టరీని 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
"భారత ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్ వేగంగా ఎదుగుతోంది. ఎక్కువ భద్రత, తక్కువ ఖర్చుతో ప్రోడక్టులను ఇవ్వడంపై మేం ఫోకస్ చేస్తాం. భద్రత కోసం ‘వేడర్’ లో ప్రత్యేకంగా క్యూరేటెడ్ సేఫ్టీ స్విచ్‌లను, హై-ఎండ్ టైర్లను అమర్చాం. మా ఆర్&డీ ఇంజనీర్ల సహాయంతో భారతీయ రోడ్లకు అనువుగా ఉండే తాజా వెర్షన్‌ను రూపొందించగలిగాం. ట్రాఫిక్ సమయంలోనూ నడపడానికి ఇది అనువుగా ఉంటుంది. మా లో స్పీడ్ బైక్ లకు చక్కటి ఆదరణ వచ్చింది. ‘వేడర్’ వల్ల మా ఈవీ బిజినెస్ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది” అని వేడర్ కు సర్టిఫికేషన్ రావడంపై ‘ఆటమ్ మొబైల్’ ఎండీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు.
