ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

జైనూర్, వెలుగు: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్,​ఆమె అంగీకరించకపోవడంతో హత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ.. మంగళవారం స్పృహలోకి వచ్చి స్టేట్​మెంట్ ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్​చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ 3 మండలాల ఆదివాసీ నాయకులు ధర్నా చేపట్టి నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సదయ్య వెల్లడించారు. జైనూర్ మండలం దేవుగూడ గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ మహిళ ఈ నెల 1న సిర్పూర్(యు) మండలం సోయంగూడకు వెళ్లడానికి జైనూర్ లో ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్  మగ్దూమ్ రాగాపూర్​దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె అంగీకరించకపోవడంతో దాడి చేశాడు. 


ముఖంపై బండరాయితో కొట్టడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ట్రీట్​మెంట్  కోసం హైదరాబాద్ కు రెఫర్ చేశారు. మొదట యాక్సిడెంట్‎గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం ఆమె స్పృహలోకి వచ్చి స్టేట్​మెంట్ ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడిని అరెస్ట్​చేసి అత్యాచారయత్నం, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే ఆదివాసీ మహిళపై దాడికి పాల్పడిన మగ్దూమ్ ను ఉరి తీయాలని డిమాండ్  చేస్తూ ఆదివాసీ సంఘాల నేతలు జైనూర్ మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగ్గారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం ఏజెన్సీ బంద్‎కు పిలుపునిచ్చారు.