ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాళ్ల దాడి ట్రెండ్ మొదలైనట్లు అనిపిస్తోంది. విజయవాడలో సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరిగి 24గంటలు గడవక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడికి యత్నం జరిగిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు మీద కూడా రాళ్ల దాడికి యత్నం జరగటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గాజువాకలో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వాహనం వెనుక నుండి రాళ్లు వేసి పరారయ్యారు ఆగంతకులు.
అయితే, రాళ్లు వాహనానికి దూరంగా పడటంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. దాడి వల్ల కొంతసేపు అంతరాయం తర్వాత చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. ఆగంతకుల కోసం టీడీపీ శ్రేణులు గాలిస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే రాళ్ళ దాడికి యత్నం జరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.