అట్లతద్ది: ఉయ్యాల పండుగ... పార్వతి దేవి ఆచరించిన వ్రతం

అక్టోబర్ 31వ తేదీ  అట్లతద్ది
తదియ ప్రారంభ సమయం అక్టోబర్ 31వ తేదీ రాత్రి 9.30 గంటలకు
తదియ ముగిసే సమయంనవంబర్ 1వ తేదీ రాత్రి 9.19

 

హిందూ పురాణాల్లో  అట్లతద్దికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆశ్వయుజ బహుళ తదియనాడు (అక్టోబర్ 31) మహిళలు జరుపుకునే ఈ పండగను అట్లతద్ది, ఉయ్యాల పండగ అని , గోరింటాకు పండగ అని తెలుగు వారు జరుపుకుంటే.. ఉత్తరాదివారు కర్వా చౌత్‌ గా జరుపుకుంటారు.  స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ అట్లతద్ది  వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని విశ్వాసం. అట్లతద్ది వ్రతాన్ని పాటించే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ తిథి ( 2023, అక్టోబర్ 31)  రోజున అట్లతద్ది పండుగను జరుపుకుంటారు.  ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు అందంగా పెట్టుకుంటారు. 

ఈరోజున ఏంచేయాలో తెలుసుకుందాం. 

తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రుడిని చూసిన తర్వాత తిరిగి గౌరీదేవి పూజ చేసి .. అమ్మవారికి  11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇవ్వాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి.  అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం ఈ పండుగలో ఉన్న మరో ప్రత్యేకత. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. 

పదేళ్లు ఈ వ్రతాన్ని చేస్తే స్త్రీలకు సంసారంలో సర్వసుఖాలు లభిస్తాయట. సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వల కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టేనని మన పురాణాలు చెబుతున్నాయి. ఇదీ మన అట్ల తద్ది పండుగకు ఉన్న విశిష్టత.

పార్వతిదేవీ చేసిన అట్లతద్ది

పురాణాల  ప్రకారం అట్లతద్ది పండగను మొదటిసారి పార్వతిదేవి తన భర్త శంకరుడు కోసం చేసిందట.  అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కొనసాగుతోంది. మరొక కథ ప్రకారం.. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు స్త్రీలందరినీ తమ భర్తల కోసం అట్లతద్ది వ్రతం పాటించమని కోరాడని..  ఆ తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందని పౌరాణిక కథ ప్రాచుర్యం పొందింది.

మహిళలు ఉపవాస దీక్ష వెనుక కారణం

పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిన సమయంలో దేవతలు తమ శక్తినంతా ఉపయోగించినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున భర్తల రక్షణ కోసం దేవతలకు అట్లతద్దిగా భావించి ఉపవాసాన్ని పాటించాలని సూచించాడు. ఇలా  ఉపవాసం చేసిన తర్వాత దేవతలు రాక్షసులను జయించగలిగారని నమ్ముతారు. అప్పటి నుండి ఈ ఉపవాసం భర్తల రక్షణ కోసం స్త్రీలు చేసే సంప్రదాయం కొనసాగుతోంది.అంతేకాదు ఇందుకు సంబంధించిన కథ మహాభారతంలో కూడా వివరించబడింది. పాండవులను రక్షించేందుకు ద్రౌపది కూడా ఈ వ్రతాన్ని పాటించిందని చెబుతారు. ఈ ఉపవాసం గురించి శ్రీ కృష్ణుడు ద్రౌపతికి సలహా ఇచ్చాడు.

ఈ పండుగ వెనకున్న అసలు కథ ఏమిటి?

పూర్వం ఓ రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారట. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్దలు దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో ఉన్నారు. ఇంతలో రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి చిన్న మాయ చేశాడట. ఓ అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రుడు వచ్చేశాడు.. అమ్మా కొంచెం పండ్లు తినిపూజ చేసుకో’ అన్నాడట. రాజ కుమార్తె అన్నమాట నమ్మి అలానే చేసింది. అయితే ఈ పూజలో ఉన్న నిబంధన ఏమిటంటే చంద్రుడు కనిపించాక షోడశోపచారాలతో ఉమాదేవికి పూజ చేసిన తర్వాతే ఏదైనా తినాలి. అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అనే పేరొచ్చింది.

సోదరుడి మాటలు నమ్మటం వల్ల రాజకుమారికి వ్రతభంగం జరిగింది. కొంతకాలానికి ఆమెకు పెళ్లయ్యింది. ఆమెకు ముసలి భర్త దొరికాడు. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి గాని ఇలా ఎందుకు జరిగిందని ఆమె బాధపడింది. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తే వారు ప్రత్యక్షమై ఆమె చేసిన తంతు గురించి చెప్పారు. తెల్లారితే ఆశ్వయుజ బహుళ తదియ అని, ఆ రోజు చంద్రోదయ ఉమా వ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని పరిష్కారం చూపారు. ఆమె అలా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన యువకుడిగా మారిపోయాడట. అందుకనే కోరిన వరుడు దొరకాలంటే ఇలాంటి వ్రతం చేయాలని కూడా అంటుంటారు. గోరింటాకు పెట్టుకుని చేతులు ఎర్రగా పండితే పండంటి భర్త దొరకుతాడనే నమ్మకం కూడా ఉంది.

ఈ పర్వదినం వెనకున్న అంతరార్థం

నారదుడి ప్రోద్బలంతో గౌరీదేవి శివుడిని భర్తగా పొందాలనుకుని మొదటిసారిగా చేసిన వ్రతమే ఈ అట్లతద్ది. ఈ పండుగ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల ఆయన కళల్లో ఉన్న శక్తి వారికి వస్తుందని, స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం. అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ఇష్టమట. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగి వివాహ జీవితం సాఫీగా సాగిపోతుందని కూడా నమ్మకం. కుజుడు స్త్రీలకు రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. దీనివల్ల గర్భధారణలో ఎలాంటి సమస్యలూ ఉండవు.

మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం, మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు శాంతిస్తాయట. 

స్త్రీల పండుగ

అట్లతద్ది రోజున వేకువ జామునే అట్లు తినడం, ఉయ్యాల లూగడం మన చిన్నప్పుడెప్పుడో జరిగిన విషయాలు. కాలం మారే కొద్దీ అట్లతద్ధినే మరచిపోయే రోజులొచ్చాయి. ఈ పండుగ రోజున ‘ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ ఉండటం మనం విన్నాం. ముఖ్యంగా కొత్త ఆడపిల్ల పెళ్లి చేసిన ఇంట్లో అట్లతద్ధినాడు వాయినాలు తీర్చడం ఆనవాయితీ. ఇది ముఖ్యంగా స్త్రీల పండుగ.