సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి , 16 మందికి తీవ్రగాయాలు 

అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఆదివారం (జూలై7,2024)  అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలం బుదవాడ ఆల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు రెండో అంతస్తులో ఉండగా సిమెంట్ తయారీలో ఉపయోగించే అత్యంత వేడి పదార్థం మూడో అంతస్తు నుంచి వారిపై పడటంతో 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంలో గాయపడిన  కార్మికుల్లో కొందరు స్థానికులు ఉండగా.. ఇంకొందరు ఉత్తర భారతదేశానికి చెందినవారు. విషయం తెలుసుకున్న కొంతమంది కార్మికులు,స్థానికులతో కలిసి సిమెంట్ ఫ్యాక్టరీ కార్యాలయంలోకి వచ్చి కిటీకీ అద్దాలు పగలగొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన కార్మికులకు ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.