శ్రీ క్రోధి నామ పంచాంగం: వృషభ రాశి వారికి ఈ ఏడాది కత్తిమీద సామే...

ఆదాయం : 2
వ్యయం      : 8
రాజపూజ్యం :7
అవమానం  : 3

కృత్తిక 2,3,4 పాదములు. రోహిణి 1,2,3,4 పాదములు. మృగశిర 1,2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో

గురువు ది. 9.4.2024 నుండి 1.5.2024 వరకు వ్యయంలో లోహమూర్తిగా సంచారం. 9.4.2024 నుండి మరల ఉగాది వరకు శని తామ్రమూర్తిగా, రాహు కేతువులు సువర్ణమూర్తిగా సంచారం చేయగలరు.

ఈ రాశి వాళ్లకు బ్యాలెన్స్​గా ఉంటుంది. ఖర్చులు అధికం. రైతులకు వ్యవసాయం వ్యయప్రయాసలతో ఉండును. లాయర్లకు, డాక్టర్లకు సామాన్యం. కాంట్రాక్టర్లకు చాలా కష్టకాలం. వృత్తి ఉద్యోగులకు వ్యతిరేకత. మనో ధైర్యం కలిగి మాట పట్టింపులు లేకుండా చాకచక్యంగా నడుచుకొనగలరు. ఈ సంవత్సరం ప్రతి రంగం వారికి కత్తి మీద సాములా ఉంటుంది. వెండి, బంగారం, కాపర్, టింబర్, ఐరన్, సిమెంట్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

జాయింట్ వ్యాపారుల మధ్యలో గొడవలు భార్యాభర్తల మధ్య చిన్న మాటకి పంతాలు, పట్టింపులు. విద్యార్థులకు మార్కులు తక్కువగా రాగలవు. సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రములు చేయగలరు. బల్క్ ఇండస్ట్రీ వారికి సమస్యలు. చిట్స్, షేర్స్​లో డబ్బు ఆవిరి అవుతుంది. మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీపై చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కార్మికులు సమస్యల వలలో చిక్కకుండా చూసుకొనగలరు. కంప్యూటర్ రంగం వారికి ఉద్యోగ భద్రత చాలా తక్కువ. చేసే పనుల్లో ఆటంకాలు కలిగి మానసికంగా కొంత అశాంతి . మనోధైర్యంతో ముందుకు సాగండి.  భయపడితే ముందుకు సాగలేరు. శారీరక శ్రమ అధికం. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఉన్నవారు, సేవాభావం కలిగినవారు తక్కువగా మాట్లాడగలరు. మాట అదుపులో పెట్టుకోవాలి. రుణములు పెరిగిపోగలవు. తొందరపాటుతనంతో ఆస్తులు కొనవలసి వచ్చి మానసికంగా ఇబ్బందులకు గురికాగలరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, ఎవరినీ బాధించకుండా జాగ్రత్తలు తీసుకొనగలరు. కోర్టు కేసులు రాజీ చేసుకొనగలరు.

సంతానం, శుభకార్యాల విషయంలో కార్యం పట్ల తలవంచుకొనిన సమస్య తలమీదుగా పోతుంది. కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు ధరించి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. రోహిణి నక్షత్రం వారు ముత్యాల మాల ధరించండి. దుర్గాదేవి జపం  నిరంతరం చేయండి. మృగశిర నక్షత్రం వారు పగడం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, పాలాభిషేకములు, దానిమ్మ రసంతో అభిషేకం, హోమం, నిరంతరం శరవణభవ అనే నామం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర గ్రంథములు పంచండి. 9 మంగళవారాలు అవకాశం దొరికితే ప్రతి మంగళవారం కందులు, ఎరుపు వస్త్రం ఒక మీటర్ పంచా కండువ మధ్య మధ్యలో దానం ఇవ్వండి. కందులు 450 గ్రా. నానబెట్టి గోవుకు దాణా పెట్టండి. పత్రికారంగంలో ఉన్నవారికి కొన్ని సమస్యలు ఉన్నవి. గురువైన శిష్యుడైన ఈ నియమములు పాటించి ఆనందంగా ఉండండి. అదృష్టసంఖ్య 6.


చైత్రం: అనుకూలంగా ఉంటుంది. తెలియని భయం. మనశ్శాంతి లేకుండా మాట్లాడుట. వ్యాపారులకు ధనాదాయం, ఆకస్మిక ధనవ్యయం. ప్రయాణములు కలసి వచ్చును. తీర్థయాత్రలు చేసే అవకాశాలు. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
వైశాఖం: ఆదాయానికి మించిన ఖర్చులు. బంధుమిత్రుల కలయిక. ఆకస్మిక ధనాదాయం. పెండింగ్ పనులు రాజీ చేసుకొనుటకు సరైన సమయం. ఆదాయానికి అనేక విధములుగా బ్రేకులు పడును. గాయత్రీదేవి ఆరాధన చేయండి.
జ్యేష్టం: వ్యాపారవృత్తుల్లో ప్రతి విషయంలో చాకచక్యంగా ముందుకు సాగండి. సంతాన లాభం. ఉన్నత పదవులు. అనారోగ్య సమస్యలు. మీ ధైర్యమే మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చును. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
ఆషాఢం: వృత్తివ్యాపారములందు ఆకస్మికంగా ధరలు పెరిగి ధనాదాయం బాగుంటుంది. తొందరపాటు నిర్ణయములు చేసి నిందలు పాలు అగుదురు. జాగ్రత్తగా, తక్కువగా మాట్లాడగలరు. అమ్మవారి పూజలు చేయండి.
శ్రావణం: గ్రహానుకూలత వలన తెలియని సంతృప్తి. ఆకస్మిక ధనలాభం. బంధుమిత్రుల కలయిక. వృత్తివ్యాపార లాభములు. వస్తు వాహన లాభం. విద్యార్థులకు మంచి మార్కులు. ఉదర సంబంధిత అనారోగ్యములు. నవగ్రహ ప్రదక్షిణలు రోజుకి 45 సార్లు చేయండి.
భాద్రపదం: చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట పదునుగా ఉన్నందువలన మానసికంగా బాధపడగలరు. బంధుమిత్రుల విషయంలో తక్కువగా మాట్లాడగలరు. ఆదాయ వనరులు ఉండగలవు. వినాయకుని హోమం చేయిస్తే అనుకూలంగా ఉంటుంది.
ఆశ్వయుజం: ఇతరుల వలన కొన్ని సమస్యలు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. ఆకస్మిక ధనాదాయం. చదువులు విషయంలో సర్వసతీదేవి ద్వాదశి నామాలు చేయవలెను. సంఘంలో గౌరవ మర్యాదలు అమ్మవారి పూజలు తప్పక చేయండి.
కార్తీకం: పై అధికారుల వలన ఒత్తిడి. ఆకస్మిక కలహములు. జాయింటు వ్యాపారులకు మాట పట్టింపులు. కొన్ని సందర్భములలో నిర్ణయం చేయుట చాలా కష్టంగా ఉంటుంది. మీ మాటకు విలువ ఇవ్వకపోవుట, ఆకస్మిక తగాదాలు. నవగ్రహ ప్రదక్షిణలు దానాలు చేయండి.
మార్గశిరం: శత్రువులు మిత్రులుగా మారుట. ఆకస్మిక ధనాదాయం. విందు భోజనములు, దూరప్రయాణాలందు అనుకూలత. తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు పూర్తిచేయండి. వాదోపవాదనలకు సమయం కాదు. మహన్యాస రుద్రాభిషేకం చేయండి.
పుష్యం: ప్రతి విషయంలో అనుకూలత. ధైర్యంగా ముందుకు సాగండి. విదేశ ప్రయాణములు. దూర ప్రయాణములు కలిసి రాగలవు. ఆటంకములు తొలగును. లౌకికంగా ఉండండి. అధికంగా లాభం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
మాఘం: విందు వినోదములు, ఆర్థికంగా బాగుంటుంది. పొగడ్తలకు పొంగిపోరాదు. ప్రమోషన్ ఉంటుంది. చాలా నెమ్మదిగా చాకచక్యంగా మసలు కోవాలి. ఏ పరిస్థితుల్లో తొందరపడి మాట్లాడరాదు. లక్ష్మీనారాయణ పూజలు చేయండి.
ఫాల్గుణం: ఆకస్మిక ధనరాబడి. చాలా చాకచక్యంగా మసలుకొనగలరు. పంతాలకు పట్టింపులకు సమయం కాదు. ఓర్పుతో లౌక్యంగా మాట్లాడగలరు. తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. శ్రీవారి దర్శనం చేసుకోండి.