మీన రాశి : మహిళలు జాగ్రత్తగా ఉండాలా.?

ఆదాయం : 11
వ్యయం      : 5
రాజపూజ్యం : 2
అవమానం  : 4

పూర్వాభాద్ర 4వ పాదము; ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు; రేవతి 1, 2, 3, 4 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం ది, దు, శ్యం, ఝా, ధా, దే, ధో, ఛా, చి
 

గురువు 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశిలో తదుపరి 29.3.2025 ఉగాది వరకు వృషభరాశిలో రజితమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచారం. రాహుకేతువులు రజితమూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. రైతులు పంటలు దిగుబడి రాక ఎక్కువగా ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపార ఉద్యోగములు చేయు వాళ్లకి అనుకూలంగా లేకపోవుట, అపవాదులు. లంచం తీసుకునేవాళ్లకి అరిష్టములు, ఏసీబీ దాడులు జరిగే అవకాశం. మహిళా ఉద్యోగులు చాలా జాగ్రత్తలు పాటించాలి. అక్రమంగా సంపాదించాలి అనే ఆశ వదిలి న్యాయంగా పని చేయండి.

దురాశకు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. లాయర్లు, డాక్టర్లు బ్యాలెన్స్​గా ఉంటారు. ఆదాయం ఉన్నా ఆకస్మిక ధనవ్యయం  ఉన్నది.  కాంట్రాక్టర్లకు ఆశాజనకం. రాజకీయ నాయకులకు పదవీ గండంతోపాటు అవమానం జరిగే అవకాశాలు ఉన్నవి. విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చును. పరీక్షల్లో టెన్షన్ వల్ల జ్ఞాపక శక్తి తగ్గును. సరస్వతీ ద్వాదశ నామాలు చదివి జ్ఞాపకశక్తిని పొంది అధిక మార్కులు సంపాదించగలరు. మీ శక్తి సామర్ధ్యములకు పరీక్ష కాలం. తీర్థయాత్రలు చేసే అవకాశములున్నవి. ఎవరి మాట నమ్మినా కష్ట నష్టములు చవిచూడాల్సి వస్తుంది. నమ్మి మోసపోవద్దు. తక్కువగా మాట్లాడగలిగితే శత్రువులు కూడా మౌనంగా ఉంటారు. కొంత ఉద్రేకం తగ్గుతుంది.

మీరు దైవాన్ని నమ్మి భక్తిశ్రద్ధలతో పురోగతి పొందగలరు. ఆదాయానికి మించి ఖర్చు జరుగుతుంది. ఏలిననాటి శనికి తైలాభిషేకం, ఎరుపు నువ్వులు కడిగి ఎండపోసినవి శని పూజ అనంతరం దానం ఇవ్వండి. గురువును నమ్మి గురుబలం పొందుటకు దక్షిణామూర్తి, సాయిబాబాను నిరంతరం ప్రార్థన చేయండి. కొంత ఉద్రేకం తగ్గుతుంది. ఆశ నిరాశలు వదలండి. అంతా అమ్మ దయ అనుకోండి. అన్ని పనుల్లో విజయం ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్లు కనకపుష్యరాగం ధరించండి. సమస్యలకు దూరంగా ఉండండి.

ఉత్తరాభాద్ర నక్షత్రము వాళ్లు ఇంద్రనీలం ధరించండి. శనికి గొంగళి పూజలు చేయించి దానం ఇవ్వండి. రేవతి నక్షత్రం వాళ్లు జాతి పచ్చ ఉంగరం బంగారంతో కుడిచేతి చిటికెన వేలుకు ధరించండి. వేంకటేశ్వర స్వామికి అలంకరణ, చక్కెర పొంగలి నైవేద్యం లేక తిరుమల దర్శనం చేసుకోండి. ధ్యానం, యోగా చేయుట వలన మానసిక పరిస్థితులకు భయపడరు. చాలా ధైర్యంగా ఉండగలరు. మీపైన నమ్మకం పెట్టుకుని భక్తి విశ్వాసములు పెంచుకుంటే... ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టసంఖ్య3.

చైత్రం : అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులను చులకనగా మాట్లాడినవారికి అనేక విధముల కష్టములు. వారిని ప్రేమగా చూసుకున్నచో అన్ని విషయములలో అనుకూలత.
 

వైశాఖం : ప్రతి విషయంలో అనుకూలత కొరకు గురువును పట్టుకుంటే సౌకర్యవంతమైన ఆదాయ వనరులు, ప్రయాణములు కలిసి రాగలవు. సంతృప్తి పొందగలరు. గురువును ఆరాధించండి. శెనగలు దానం ఇవ్వండి.
 

జ్యేష్టం : సామాన్యంగా ఉన్నట్లు ఉంటుంది. ఆర్థిక విషయంలో అనుకూలం. ఆదరాభిమానంగా స్పందించగలరు. మనస్ఫూర్తిగా ఉంటారు. ఎదుటివారిని గమనించండి. నవగ్రహ ఆరాధన జపములు ప్రదక్షిణలు చేయండి.
 

ఆషాఢం: అనేక చిక్కు సమస్యలు ఉండగలవు. శని బలం లేక ఇతరుల దగ్గర కొన్ని రోజులు లేక కొన్ని నెలలు ఉండవలసి వచ్చును. గ్రహాల అనుకూలత లేదు. నవగ్రహ ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం, నువ్వులు కడిగి ఎండపోసినవి కిలోంబావు, నలుపు వస్త్రం దానం చేయండి.
 

శ్రావణం : పరమేశ్వరుని ధ్యాన దీక్షలో విజయం ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకములు తొలగును. ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలందు అనుకూలం. గ్రామదేవతా అనుగ్రహం పొంది ఆనందంగా ఉంటారు.
 

భాద్రపదం : అనుకూల వాతావరణంలాగ ప్రగతిపథంలో ముందుకు సాగండి. ప్రోత్సాహకరంగా విందు వినోదములు. విఘ్నేశ్వరుని ఆరాధన సంతృప్తినిస్తుంది. లక్ష్మీగణపతి హోమం చేసి గృహోపకరణ వస్తువాహనములు పొందుటకు అనుకూలం. పితృదేవతలను సంతృప్తి పరచండి.
 

ఆశ్వయుజం : సామాన్యంగా ఉంటుంది.  నిరాశ వదలి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. నిత్యపూజలు శరవణభవ నామస్మరణ వలన అనారోగ్య సమస్యలు, గుండె సంబంధమైన దోషములకు, గాయములకు పరిష్కారం ఉంటుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
 

కార్తీకం : అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాల్లో సంతృప్తి. ఎన్నో నెలల నుండి పెండింగ్​లో ఉన్న పనులు నెరవేరుటకు ప్రయత్న లోపం లేకుండా చూసుకొనగలరు. ఆధ్యాత్మికంగా ధ్యానం, యోగా వలన ఆనందం. ఈశ్వర ఆరాధన శక్తిని నింపగలదు.
 

మార్గశిరం : అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరాభిమానములు. ఆర్థిక ఒత్తిడి తగ్గును. గృహంలో అందరిని మాటలతో ప్రేమగా ఉంటారు. ఆనందంలో విజయం వరించగలదు. వేంకటేశ్వర స్వామి అలంకరణ, చక్కెర పొంగలి ప్రసాదములు చేయండి.
 

పుష్యం : అనుకూలంగా అందరితో కలిసి మెలసి ఉత్సాహంగా ఉంటారు. నూతన సంక్రాంతి వైభవములతో సంతృప్తిని పొందగలరు. పరమేశ్వరుని దయ, పితృదేవతల సంతృప్తి చాలా తృప్తికరంగా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులు అగుదురు.
 

మాఘం : ప్రతి విషయంలో అనుకూలత. విందు వినోదములు. బంధుమిత్రుల కలయిక. అందరి మన్ననలు పొందగలరు. అందరిని సంతృప్తి పరచగలరు. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి.
 

ఫాల్గుణం : ప్రతి విషయంలో అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ఆనందంగా ఉండగలరు. వివాహ ప్రయత్నములు ఫలించగలవు. జాతకములు కలిసిన వారితో వివాహం ఆనందంగా ఉంటుంది. సత్యదేవుని వ్రతం చేయండి.