శ్రీ క్రోధి నామ పంచాంగం :  మిథునం రాశి వారికి ఎలా ఉందంటే.?

ఆదాయం : 5
వ్యయం      : 5
రాజపూజ్యం :3
అవమానం  : 6

మృగశిర 3,4 పాదములు; ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం  కా, కీ, కూ, ఖం, జ్ఞ, చ్చ, కే, కో, హ

గురువు తేది 9.4.2024 నుండి తేది 1.5.2024 మరల ఉగాది వరకు లాభంలో లోహమూర్తిగా సంచారం. శని తేది 9.4.2024 నుండి మరల ఉగాది వరకు భాగ్యంలో సువర్ణమూర్తిగా, రాహు కేతువులు లోహమూర్తులుగా సంచారం.

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులు ముహూర్త బలంతో అధిక దిగుబడి, పంటలు బాగా పండగలవు. వృత్తి, ఉద్యోగ వ్యాపారు లకు ఆదాయ వనరులు బాగుండగలవు. లాయర్లు, డాక్టర్లకు, కాంట్రాక్టర్లకు అనుకూలం. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. ప్రతిరంగం బిగ్ ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ ఫార్మా రియల్ ఎస్టేట్ వారికి ఆదాయ వనరులు ఉన్నవి. వివాహము.. ఎవరికి వారు ఏ ప్రయత్నమైనా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు నెరవేరగలవు. బంధుమిత్రులు కలయిక. వారసత్వ ఆస్తులకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కారం. ప్రతి విషయంలో కార్యసిద్ధి. న్యాయ సంబంధమైన పనులు పూర్తి చేసుకొనగలరు. అనారోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవి. నమ్మిన వాళ్లే మిమ్ములను మోసం చేయగలరు. సమస్యలు అధికంగా రాగలవు. నమ్మకం వలన పోలీస్  క్రిమినల్ కేసులు రాగలవు. ఏ విషయంలోనైనా నమ్మకం వద్దు. ముక్కు సూటిగా మాట్లాడిన ప్రయోజనం లేదు. ఎక్కడా ఇరుక్కోవద్దు. సాక్షి సంతకాల వల్ల కూడా కష్టములు రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం.

అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే సంఘంలో గౌరవ మన్ననలు అంత పెరుగును. అన్ని విషయాల్లో చాకచక్యంగా మసలుకొనగలరు. రాజకీయమునకు పనికిరారు. ప్రతి విషయంలో అందరినీ మెప్పించలేరు. వస్తు వాహన యోగాలు. కొన్ని విషయాల్లో తల దూర్చి ఇబ్బందులలో చిక్కుకునే అవకాశాలు ఉన్నవి. ఎక్కడా ఇరుక్కోరాదు. మృగశిర నక్షత్రం వాళ్లు పగడం ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు, గోవునకు 450 గ్రా. కందులు నానపెట్టి దాణా పెట్టండి. ఆరుద్ర నక్షత్రం వాళ్లు జాతి గోమేధికం ధరించండి. ప్రతి ఆరుద్ర నక్షత్రంలో శివునికి రుద్రాభిషేకం, మహన్యాస రుద్రాభిషేకం చేయగలరు. దుర్గాదేవికి కుంకుమ పూజ, అష్టోత్తరం చేయుట వలన ఆర్ధిక లోటు ఉండదు.

పునర్వసు నక్షత్రం వాళ్లు కనక పుష్యరాగం ధరించండి. షిరిడి సాయి బాబా పూజలు, దక్షిణామూర్తి అష్టోత్తరం, గురుపూజలు చేయుట వలన ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. శనగలు గుగ్గిళ్లు గురువారం సాయంత్రం పంచండి. గృహంలో అఖండ దీపారాధన చేయండి. నిరంతరం గురు ధ్యానం వలన ఎవరితో మోసపోరు. అదృష్టసంఖ్య 5. చైత్రం: అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా బంధుమిత్రులు కలయిక. ప్రేమానురాగములు కలిగి ఉండగలరు. వివాహ ప్రయత్నములు ఫలించుట. సంఘంలో గౌరవ మర్యాదలు, వినయ విధేయతలు. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు చేయండి.

వైశాఖం : ఆదాయ వనరులు కలిగి ఉండగలరు. అధిక ఖర్చులు ఉండగలవు. ఓర్పు నేర్పుతో ముందుకు సాగండి. అనారోగ్య సూచనలు. విందు వినోదములు, బంధుమిత్రుల కలయిక. విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

జ్యేష్టం : ఆర్థిక వెసులుబాటు తక్కువ. అనారోగ్య సూచనలు. ప్రయాణాల్లో చాలా శ్రద్ధ అవసరం. రెండవ వారం నుండి అనుకూలం. నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి.

ఆషాఢం :  బీపీ హెచ్చు తగ్గుల వల్ల కొంత ఆందోళన ఉంటుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొనగలరు. కోపతాపములకు సరైన సమయం కాదు. తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేసుకొనగలరు. అమ్మవారి పూజలు, గ్రామ దేవత ఆరాధన శాంతినిస్తుంది.

శ్రావణం : కొన్ని ఇబ్బందికర సమస్యలు. మాట అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్, ఆకస్మిక ధనాదాయం. తరచూ ఏదో ఒకటి ఆలోచించడం మంచిది కాదు. 

భాద్రపదం : మానసిక సంబంధమైన ఇబ్బందులు రాగలవు. స్నేహితులు మీ విలువ గుర్తించగలరు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా అంతా మనమంచికే అనుకొని ముందుకు సాగండి. మీరు హుందాతనంగా ఉండండి. శనికి తైలాభిషేకం నువ్వుల దానం ఇవ్వండి.

ఆశ్వయుజం : అధికారులు ఒత్తిడి. కొన్ని సందర్భాల్లో తెలియని భయం. డబ్బు సమస్యలు ఎక్కువగా ఉండగలవు. అనారోగ్య సమస్యలు. మూడవ వారంలో ఉపశమనం. దుర్గాదేవి పూజలు చేయండి. 

కార్తీకం : ప్రయాణాలు లాభించగలవు. ఆకస్మిక ధనం వచ్చును. బంధుమిత్రుల కలయిక. సరస్వతి కవచం, లక్ష్మీ కవచం, కనకధార స్తోత్రం చేయండి. నమ్మకంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఆనందంగా ఉంటారు.

మార్గశిరం : అమ్మవార్ల జపం ప్రతిరోజు చేయుట వలన ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉంటారు. కోర్టు కేసులు రాజీమార్గంలో సెటిల్ చేసుకోవాలి అనుకుంటే రాజీ జరుగును. పట్టుదలతో ప్రయత్నం చేయండి.

పుష్యం : పరిస్థితులను గమనించి జాగ్రత్తగా ముందుకు సాగండి. ప్రతి విషయంలో బాధ్యతగా ఉండండి. ఆకస్మిక ధనలాభం. సంఘంలో గౌరవం. దొంగతనం జరుగుటకు అవకాశం. జాగ్రత్తగా ఉండండి. శివునికి మహన్యాస రుద్రాభిషేకం చేయండి.

మాఘం : వ్యాపారులకు చట్టపరమైన సమస్యలు. ఆందోళన వలన అనారోగ్యం కాచుకొని ఉంది. ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండండి. ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే పరిష్కారమవుతుంది. నవగ్రహ జపదానాలు ప్రదక్షిణలు చేయండి.

ఫాల్గుణం : తెలియని విధంగా అనారోగ్యములు. శకునం చూసి బయటకు వెళ్ళండి. కింద పడి దెబ్బలు తగిలే అవకాశములు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శెనగల గుగ్గిళ్ల ప్రసాదములు బాబా ఆలయంలో పంచండి.