శ్రీ క్రోధి నామ పంచాంగం : కర్కటరాశి.. ఎవరికి ధన లాభమంటే.?

ఆదాయం : 14
వ్యయం      : 2
రాజపూజ్యం : 6
అవమానం  : 6

పునర్వసు 4 పాదము; పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం హి, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో

గురువు 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశి యందు రజితమూర్తిగా 29.3.2025 ఉగాది వరకు సంచారం.శని 9.4.2024 నుండి 29.4.2025 ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం.రాహు కేతువులు 9.4.2024 ఉగాది వరకు తామ్రమూర్తులుగా సంచారం.

ధనాదాయం అనుకూలంగా ఉన్నది. వ్యవసాయం చేయు రైతు సోదరులకు పంటల దిగుబడి, వేసిన పంటలకు ధర ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలం. లాయర్లు, డాక్టర్లకు ఆదాయమునకు కొదవలేదు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే రోజులు. రాజకీయ నాయకులకు ప్రతి విషయంలో అనుకూలం. బిగ్ ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ వారికి అనుకూలమైన ఆదాయ వనరులు. విద్యార్థులు సరస్వతి ద్వాదశ నామాలు చదివిన వాళ్లకి మార్కులు అధికంగా రాగలవు. ప్రతి వ్యాపారికి అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, టేకు, ఐరన్, సిమెంట్, కంకర, ఇసుకలో అర్థం కాని దోపిడీ ఉంటుంది. పౌల్ట్రీలో సామాన్య లాభాలు, మత్స్య పరిశ్రమలో హెచ్చు తగ్గులు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. చిట్స్​లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలం. షేర్స్ అర్థం కాని పరిస్థితులు ఉండగలవు. కిరాణ, ఫ్యాన్సీ, రంగులు

రసాయనాలు, కెమికల్స్ వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణం, బంగారు ఆభరణములు, వాహన యోగం. గృహంలో అవసరమైన అలంకార వస్తువులు, పిల్లల విదేశీయానం, వివాహ ముహూర్తములు, విందువినోదములతో ఇష్టాగోష్టిలతో బంధుమిత్రులతో ఆర్భాటములకు అధిక ధన వ్యయం చేస్తారు. రాబడి ఉంటుంది. ఆర్బాటములకు అడ్డుకట్ట వేయలేరు. సంఘంలో గౌరవం పెరుగును. శత్రు బాధలు ఉన్నా అర్థం కావు. పునర్వసు నక్షత్రము వాళ్లు కనకపుష్యరాగం బంగారంలో ధరించగలరు. గురుదర్శనం దక్షిణామూర్తి ఆరాధన చేయండి. పుష్యమి నక్షత్రం వాళ్లు ఇంద్రనీలం ధరించండి.

శనిగ్రహ ఆరాధన నువ్వులు కడిగి ఎండపోసినవి దానం, తైలాభిషేకం, తోలు చెప్పులు, నలుపు గొడుగు, ఇనుప గంటె, నలుపు గొర్రె, గొంగళి నలుపు బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఆశ్లేష నక్షత్రం వాళ్లు జాతి పచ్చ రాయి  బంగారంతో చేయించి కుడిచేయి చిటికెన వేలుకు ధరించండి. శ్రీ వేంకటేశ్వర స్వామికి చక్కెరపొంగలి ప్రసాదములు, స్వామివారికి అలంకరణ చేయించండి. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అన్ని విషయములలో పురోగతి ఉంటుంది. అదృష్టసంఖ్య 2.

చైత్రం : అనేక విధములుగా సమస్యలు రాగలవు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. గ్రహారాధన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి పూజలు, హోమం. ఏది సంతృప్తిని ఇవ్వగలదో ఆ ప్రకారం చేయండి. శివునికి, విష్ణువునకు ఆరాధన తప్పనిసరి. 

వైశాఖం : అనుకూలమైన రోజులు, ఆదాయ వనరులు బాగుండగలవు. గతంలో ఉన్న బాకీలు తీర్చుకొనుటకు సరైన సమయం. జాగ్రత్తగా ఉండి, శని దేవునికి పూజలు జపాలు చేయుట వలన అనుకూలత ఉంటుంది. 

జ్యేష్టం : విజయం వరించగలదు. ప్రత్యర్థులను ఇట్టే బోల్తా కొట్టించగలరు. ఇతరులు సానుభూతి చూపగలరు. శత్రువులు మిత్రులుగా ఉంటారు. ధన రాబడి ఉంటుంది. విష్ణు సహస్ర నామం చేయండి.

ఆషాఢం : కొందరు ఎత్తులకు పైఎత్తులు వేస్తారు. చాకచక్యంగా ఉండాలి. వినయ విధేయతలతో సమస్యలు పరిష్కరించుకొనవలెను. అనారోగ్య సమస్యలు. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

శ్రావణం : ప్రతి విషయంలో తొందరపాటుతనం లేకుండా ఉండాలి. చెడు స్నేహాలు వదలండి. చాలా చలాకీగా ఉండగలరు. హామీ ఉండరాదు. ఉన్నారో మీరు సంపాదించింది పోతుంది. మీ వృత్తి వ్యాపారాల్లో అనుకూలత. విష్ణు సహస్ర నామపారాయణ తప్పనిసరిగా చేయండి.

భాద్రపదం : పురుషులకు సంఘంలో వినయ విధేయత వలన శత్రువులు మిత్రులగుదురు. బంధుమిత్రుల ఆదరాభిమానములు, పిల్లల విషయంలో శ్రద్ధ ఉంచండి. ధనసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండగలవు. శుభ పరిణామములు. ఇష్టదేవతా ఆరాధన చేయండి.

ఆశ్వయుజం : ప్రతి విషయంలో నిర్లక్ష్యం లేకుండా సామరస్య ధోరణి కలిగి ఉండాలి. అహంకారం వలన అనేక విధాలుగా పరిణామములు ఉండగలవు. ఒక తప్పుకు ఎన్నో అబద్ధాలు చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ జపదానములు ప్రదక్షిణలు చేయండి. ఆర్థికంగా బాగుంటుంది. దుర్గాదేవి పూజలు చేయండి.

కార్తీకం : ప్రయాణాల్లో ఆకస్మిక ప్రమాదములు పొంచి ఉన్నవి. శకునం చూసి బయలుదేరగలరు. తొందరపాటు వలన అనేక విధములుగా ఇబ్బందులు పడవలసి ఉన్నది. ఆగి ఆలోచన చేయండి. ఏమి జరుగుతుందో అర్థంకాదు. ఆదాయ వనరులు బాగుండగలవు. అమ్మవారి ఆరాధన చేయండి.

మార్గశిరం : స్నేహితులు, బంధుమిత్రులు విమర్శించగలరు. ఏసీబీ దాడులు, ప్రతి విషయం కత్తి మీద సాములా ఉంటుంది. తెలియని అవరోధములు చాకచక్యంగా ఓర్పుగా ఉండాలి. మాట అదుపులో పెట్టుకోవాలి. ఉద్రేకమునకు సమయం కాదు. ధనాదాయం బాగుంది. శని తైలాభిషేకం చేయండి.

పుష్యం : పేరు గొప్పకు పోతే అనుకోని ఖర్చులు. ఏమరుపాటు లేకుండా ఉండవలసిన సమయం. ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి. ఆదాయం ఉంటుంది. శ్రీవారి దర్శనం చేయండి.

మాఘం: సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం కొరకు పూజలు. అనారోగ్య సమస్యలు. భూములు కొనుట వలన అధిక ఆదాయం ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకొనగలరు. మహన్యాస రుద్రాభిషేకం చేయండి.

ఫాల్గుణం : వనరులు అనుకూలంగా ఉన్నవి. చాకచక్యంగా నడుచుకొనగలరు. ఇతరుల మన్ననలు పెరుగును. కాని పొంగి పోరాదు. దుర్గాదేవి ఆరాధన వలన అనుకూలమైన ఆదాయ వనరులు కలిగి ఉంటారు.