సీఎంఆర్‌‌ ఇవ్వని రైస్‌‌ మిల్లర్ల ఆస్తులు జప్తు

  • వనపర్తి జిల్లాలో నలుగురు మిల్లర్ల ఇంట్లో టీవీలు, ఏసీలు, బైక్‌‌లు సీజ్‌‌ చేసిన ఆఫీసర్లు

వనపర్తి/పెబ్బేరు/కొత్తకోట/వీపనగండ్ల, వెలుగు: వనపర్తి జిల్లాలో సీఎంఆర్‌‌ ఇవ్వని రైస్‌‌ మిల్లర్ల ఇండ్లపై రెవెన్యూ ఆఫీసర్లు శనివారం దాడులు నిర్వహించారు. బకాయిలు భారీగా ఉండడంతో ఇంట్లోని వస్తువులను సీజ్‌‌ చేసి తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు తరలించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 85 మంది మిల్లర్ల నుంచి రూ. 130 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో 30 మందికి రెవెన్యూ రికవరీ యాక్ట్‌‌ ప్రకారం ఆగస్ట్‌‌ 8న నోటీసులు జారీ చేసి 23వ తేదీ వరకు బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. అయినా మిల్లర్లు స్పందించకపోవడంతో శనివారం పలువురి ఇండ్లపై దాడి చేసి ఆస్తులను జప్తు చేశారు. 

పెబ్బేరు మండలం రంగాపూర్‌‌ గ్రామంలోని శివసాయి రైస్‌‌ మిల్‌‌ యజమాని, జనుంపల్లి గ్రామానికి చెందిన రేషన్‌‌ డీలర్ వెంకట్రామిరెడ్డి 5,628 టన్నుల బియ్యానికి గాను 1,067 టన్నులు ఇచ్చాడు. ఇంకా రూ. 3,57,22,693 విలువైన 4,561 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆయన ఇంట్లో తనిఖీ చేసి టీవీ, ఏసీ, స్కూటీ తదితర వస్తువులను జప్తు చేశారు. ఆఫీసర్లు వచ్చిన టైంలో వెంకట్రామిరెడ్డి ఇంటి డోర్లు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పి బయటకు రప్పించారు. 

కొత్తకోట మండలం నాటవెల్లి  సమీపాన ఉన్న వెంకటేశ్వర ట్రేడర్స్‌‌ యజమాని వెంకటరమణ రూ.3 కోట్లు బకాయి ఉండడంతో కారు, టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఇన్వర్టర్‌‌ బ్యాటరీస్‌‌ జప్తు చేసి తాహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు తరలించారు. వీపనగండ్ల మండలం కల్వరాలలోని వెంకటేశ్వర రైస్‌‌మిల్‌‌ ఓనర్‌‌ మహేశ్‌‌  రూ.3 కోట్లు బకాయి ఉండగా బీరువా, టీవీ, ఫ్రిడ్జ్‌‌, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నంబావి మండలం వెలగొండలోని మిల్లర్‌‌ మహేశ్వర్‌‌రెడ్డి రూ.3,87,96,000 బకాయి ఉండడంతో వనపర్తిలోని ఆయన ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్‌‌, టీవీ, బైక్‌‌ జప్తు చేశారు. కాగా సీఎంఆర్‌‌ ఇవ్వాల్సిన మిల్లర్లు స్పందించకపోవడంతో కలెక్టర్‌‌ ఆదేశాల మేరకు ఆస్తులను జప్తు చేస్తున్నట్లు సివిల్‌‌ సప్లై డీఎం ఇర్ఫాన్‌‌ తెలిపారు.