ఏపీ దిశ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో దిశ- 2019 బిల్లును ఏపీ హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. సభలో దిశ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి…వ్యవస్థలో మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యిందన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. నేరం చేసినవారు ఎంతటి వారైనా వారిని వదలకూడదన్నారు. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందన్నారు సీఎం జగన్.
ఏపీ దిశ చట్టం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు
1.మహిళలు, బాలికలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష.నిర్భయం చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తయితే , మరో 2 నెలల్లో శిక్షలు పడాలి. మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ రెండూ పూర్తికావాలి. దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదిస్తు నిర్ణయం తీసుకుంది. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్లయితే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూర్తయితే శిక్ష పడాలి.
2.అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచుతు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు. కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 10 నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష, నేరం తీవ్రతను బట్టి జీవిత ఖైదు.
3.అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ.
4.సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఇకపై సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిస్తే మొదటి తప్పుడు పోస్టింగ్‌కు 2 ఏళ్లు, ఆ తర్వాత రెండోసారి తప్పుడు పోస్టింగ్‌కు 4 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఐపీసీలో 354(ఇ), 354(ఎఫ్) సెక్షన్ల చేర్పునకు గ్రీన్‌సిగ్నల్.
5.ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాలు జరిగితే సత్వర విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల్లేవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు. ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని, రాష్ట్రం కేవలం 3 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
6.మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్దతిలో డేటా బేస్ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్ రిజిస్ట్రీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
