పెబ్బేరు పట్టణంలో ప్రైవేట్​ స్కూల్​ యజమానిపై హత్యాయత్నం

పెబ్బేరు, వెలుగు : పట్టణంలోని ఓ ప్రైవేట్​ స్కూల్​ ఓనర్​పై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామానికి చెందిన రాజేందర్​ గౌడ్​ అలియాస్​ రాజు 15 ఏండ్లుగా పెబ్బేరులో ఉంటున్నాడు. పదేండ్ల నుంచి మాంటిస్సోరి స్కూల్​ను నడిపిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో స్కూల్​లోని బెడ్రూమ్​లో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేశారు.

 రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లగా, హైదరాబాద్​కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.  అంబులెన్స్​లో సోమాజిగూడ యశోద హాస్పిటల్​కు తరలించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, కొత్తకోట సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై స్కూల్​లో పని చేసే వారిని అడిగి తెలుసుకున్నారు. క్లూస్​ టీమ్​తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్​ రెడ్డి తెలిపారు.