కాంగ్రెస్​ లీడర్లపై హత్యాయత్నం

  •     కత్తులు, కర్రలతో బీఆర్ఎస్​ 
  •     కౌన్సిలర్​ భర్త, అనుచరుల దాడి 
  •     అచ్చంపేటలో ఉద్రిక్తత
  •     బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

అచ్చంపేట, వెలుగు :  నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేటలో శుక్రవారం ఇద్దరు కాంగ్రెస్ ​లీడర్లపై బీఆర్ఎస్​ కౌన్సిలర్​భర్త, అతడి అనుచరులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. దీంతో వారు స్థానికుల సహకారంతో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..పది రోజుల కింద అచ్చంపేటలో సాయినగర్​కాలనీలో ఓ దాడి జరగ్గా పోలీసులు పికెటింగ్​ఏర్పాటు చేసి రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయిగర్ కాలనీలో బంధువు చనిపోవడంతో కాంగ్రెస్​ లీడర్లు మంత్రాల లాలూ యాదవ్, మంత్రాల అంజి యాదవ్​ వచ్చారు.

ఇది తెలుసుకున్న రెండో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సుంకరి నిర్మల భర్త బాల్ రాజ్, అతడి అనుచరులు సుంకరి లింగం, బాలకృష్ణ, సురేశ్, రాజు, ఇంకొందరు కత్తులు, కర్రలతో వారిపై దాడి చేశారు. దాడిలో లాలూ యాదవ్ తల,చెవి, వీపుపై తీవ్ర గాయాలు కాగా, అంజియాదవ్ కాలు విరగడంతో పాటు వీపుపై గాయాలయ్యాయి. కొద్దిసేపటికి స్థానికుల సహకారంతో తప్పించుకుని పీఎస్​కు వెళ్లి కంప్లయింట్​ ఇచ్చారు. అక్కడి నుంచి 

ఇద్దరిని అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు 

తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న కాంగ్రెస్ ​లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దవాఖానకు తరలివచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ హాస్పిటల్​కు వచ్చి బాధితులతో మాట్లాడారు. ఓటమిని జీర్ణించుకోలేకే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాములు తెలిపారు.   దాడికి పాల్పడిన వారు అచ్చంపేట పోలీస్ స్టేషన్​లో లొంగిపోయినట్లు సమాచారం.