ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ఓ వ్యక్తి వరద నీటిలో దిగాడు. సీఎంతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే తాపత్రయంలో నడుము లోతులో మునిగాడు. అక్కడున్న రెస్క్యూ టీం అతడిని సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. మీకు నేను అభిమాని అంటూ.. సీఎంతో అతడు కరచాలనం చేశాడు. ఈ ఘటన అస్సాంలోని సిల్చార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం హిమంత బిస్వశర్మ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అందుతున్న సహాయచర్యలను ఆయన పరిశీలిస్తున్నారు. వరద నీటితో దిగ్భంధంలో ఉన్న సిల్చార్ ప్రాంతాన్ని సందర్శించారు. పడవలో తిరుగుతూ.. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్నాడు. సీఎంతో మాట్లాడేందుకు, ఓ వస్తువును ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వద్దు.. వద్దు.. అని రెస్క్యూ టీం చెబుతున్నా.. అతను వినిపించుకోలేదు. అమాంతం నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న గేటును పట్టుకోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వెంటనే అక్కడున్న రెస్క్యూ టీం అతని దగ్గరికి వెళ్లింది. భుజాలపై అతడిని మోసుకుని సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. మీ అభిమానిని అంటూ చెప్పాడు. దీనికి సీఎం హిమంత థాంక్స్ చెప్పారు. అనంతరం అస్సామీ సంప్రదాయ దుస్తులను అతడికి అందజేశారు. తాను ఎప్పుడైనా ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా ఓ కప్పు టీ తాగుతానని అని డాబా పైనున్న ఇంటి యజమానురాలికి హామీనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక అస్సాంలో వరదల పరిస్థితికి వస్తే... కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 121 మంది చనిపోయారు. 25 జిల్లాల్లో 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. సిల్చార్ లో పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. కనీసం అడుగు బయట పెట్టడానికి కూడా వీలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి అధికారులు డ్రోన్ లను ఉపయోగిస్తున్నారు. ‘‘మొదట విద్యుత్ ను పునరుద్ధరించాలని అనుకుంటున్నాం. రానున్న 24 గంటల్లో వర్షాలు కురవకపోతే సిల్చార్ లో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది’’ అని సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు.
#WATCH | Assam CM Himanta Biswa Sarma visited the flood affected Barak valley area where a resident braved flood waters to greet him with a 'Gamusa' pic.twitter.com/VOvQayYBoo
— ANI (@ANI) June 26, 2022
