అస్సాంలో వరదలు.. 48 లక్షల మందిపై ప్రభావం

అస్సాంలో వరదలు.. 48 లక్షల మందిపై ప్రభావం

అస్సాంలో వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. భారీ నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయిలవుతున్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో పాటు దాని ఉప నదులు ఉప్పొంగడంతో ఈశాన్య రాష్ట్రంలో దాదాపు 48 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది. వరదల కారణంగా.. 449 గ్రామాల్లోని 2 లక్షల 07 వేల 143 మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథార్టీ (ASDMA) విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. వరదల వల్ల 113485.37 హెక్టార్ల పంట నష్టానికి గురైందని అంచనా వేస్తున్నారు. 33 లక్షల 84 వేల 326 జంతువులపై ఎఫెక్ట్ పడిందని, ఇందులో 5 వేల 232 పశువులు కొట్టుకపోయాయని పేర్కొంది.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. బరాక్ లోయలో ఉన్న కాచర్ కు సిబ్బందిని తరలించారు. భువనేశ్వర్ నుంచి నాలుగు యూనిట్ల ఎన్డీఆర్ ఎఫ్ (NDRF) బృందాలను తరలించామని సీఎం హిమంత బిస్వాశర్మ తెలిపారు. ఏర్పాటు చేసిన 810 సహాయ శిబిరాలకు 2 లక్షల 31 వేల 819 మందిని తరలించారు. 615 తాత్కాలిక పంపిణీ కేంద్రాల ద్వారా సహాయక సామాగ్రిని అందించారు. నిమతి ఘాట్, తేజ్ పూర్, గౌహతి, ధుబ్రీ, గోలపరా ప్రాంతాల వద్ద బ్రహ్మపుత్ర నది పోటెత్తుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) బులెటిన్ లో వెల్లడించింది. నాగోన్ జిల్లాలోని కంపూర్ వద్ద కోపిలీ నది స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా రైళ్లను రద్దు చేశారు అధికారులు. కొన్నింటిని దారి మళ్లించింది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. 

గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 36 జిల్లాలోని 32 జిల్లాలు ముంపునకు గురి కావడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 11 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల 44 మంది చనిపోయారు.