హైదరాబాద్, వెలుగు: భాగ్యనగరంలో మరో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఏహెచ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ టోర్నీని హైదరాబాద్‌కు కేటాయించినట్టు హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు. జూన్ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఖతార్, జపాన్, చైనాతో పాటు 12 నుంచి 15 ఆసియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయని, ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ టోర్నీ మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతాయని, మరో ప్రముఖ స్పోర్ట్స్ చానల్‌లో లైవ్ అందించేందుకు చర్చలు జరుపుతున్నామని జగన్ తెలిపారు.
