హైదరాబాద్, వెలుగు: అశోకా బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్ బీ ఎల్) హైదరాబాద్‌లో రూ.235 కోట్ల విలువైన పది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఈ విషయాన్ని వెల్లడించింది. భూమి కొనుగోలుకు నిర్వహించిన బిడ్డింగులో ఏఎస్‌బీఎల్ విజేతగా నిలిచింది. సిటీలోని కూకట్ పల్లిలో ఈ జాగా ఉంది. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ ఇక్కడి నుంచి కనెక్టివిటీ బాగుంటుందని తెలిపింది. ఈ లావాదేవీకి తాము ఎక్స్ క్లూజివ్ ట్రాన్సాక్షన్ పార్ట్‌నర్ గా పనిచేశామని వివరించింది. హైదరాబాద్‌లో రియల్టీ మార్కెట్ బాగుందని, అందుకే క్యూ3లో సేల్స్ బాగా పెరిగాయని జేఎల్ఎల్ పేర్కొంది. కూకట్ పల్లి ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు విపరీతంగా డిమాండ్ ఉండటంతో ఏఎస్‌బీఎల్ ఇక్కడ జాగా తీసుకుంది. హోం లోన్లు తక్కువ వడ్డీకి రావడం, ఐటీ సెక్టార్ దూకుడు, రియల్టర్లు ఆఫర్లు ఇవ్వడం వల్ల హైదరాబాద్‌లో ఇండ్ల కు డిమాండ్ చాలా బాగుంది. ఈ ఏడాది క్యూ3లో అమ్మకాలు 65 శాతం పెరిగాయి. గత ఏడాది క్యూ3లో 34 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ రికార్డయింది. ఈ సంవత్సరంలో క్యూ3లో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లోనే అత్యంత ఎక్కువగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. మనదేశంలోని మెట్రోల్లో ఇండ్ల ధరలు తక్కువగా ఉన్న సిటీల్లో హైదరాబాద్ ఒకటి. మధ్యతరగతి జనం కూడా హైదరాబాద్‌లో ఇండ్లు కొనుక్కోవచ్చని జేఎల్ఎల్ తెలిపింది.
