న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లింలపై తప్పుడు కేసులు పెట్టడం, టెర్రరిస్టులంటూ ముద్ర వేయడం పరిపాటిగా మారిందని అమానతుల్లా ఖాన్ కామెంట్ చేశారు. ముస్లింలను నకిలీ కేసులతో చిత్రవధలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెండ్రోజుల కింద దేశ రాజధానిలో పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులంటూ ఆరుగురు యువకుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై స్పందనగా అమానతుల్లా పైవ్యాఖ్యలు చేశారు.
‘ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు దేశంలోని ముస్లింలపై నేరాలు పెరుగుతూ పోతున్నాయి. అమాయక ముస్లింలను తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే ఆట మొదలైంది. మున్ముందు ఇంకెంత మందిపై అబద్ధపు ఆరోపణలు చేస్తారో చూడాలి’ అని అమానతుల్లా ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. యూపీ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల వివరాలను ఆప్ ప్రకటించింది. యూపీతో పాటు వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఆప్ ప్లాన్ చేస్తోంది.
