నెలకు రూ.18 వేల వేతనం: ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో కీలక హామీ

న్యూఢిల్లీ: 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే టార్గెట్‎గా ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు వరాల జల్లు కురిపించిన కేజ్రీవాల్.. తాజాగా పూజారులు, గ్రంథిలకు కీలక హామీ ఇచ్చారు. వీరి కోసం ‘పూజారి గ్రంథి సమ్మాన్ యోజన’ స్కీమ్ ప్రకటించారు. ఢిల్లీలో ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ కింద.. దేవాలయాల పూజారులు, గురుద్వారా గ్రంథిలకు నెలకు రూ.18,000 ఆర్థిక సహాయం అందజేయనున్నారు. 

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ ఇవాళ ఒక పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా. ఆ పథకం పేరు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన. ఈ స్కీమ్ కింద దేవాలయాల పూజారులు గురుద్వారాలో ఉండే గ్రంథిలకు నెలకు రూ. 18,000 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ అని పేర్కొన్నారు. పురోహితులు, గ్రాంథిలు మన మతపరమైన ఆచారాలకు ఏళ్ల తరబడి సంరక్షకులుగా ఉన్నారని.. సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారని కొనియాడారు.  

ALSO READ | మన్మోహన్ సింగ్ ఒక విజనరీ లీడర్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కానీ దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోలేదని.. వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పూజారి గ్రంథి సమ్మాన్ యోజన స్కీమ్ ప్రకటించామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం (డిసెంబర్ 31) నుంచి ప్రారంభమవుతుందని, హనుమాన్ ఆలయంలో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనైనా అడ్డంకులు సృష్టించవద్దని బీజేపీ, కాంగ్రెస్‎ను అభ్యర్థిస్తున్నా.. దీన్ని అడ్డుకోవడం పాపం చేసినట్లే అవుతుంది. ఎందుకంటే వారు దేవునికి వారధిగా ఉంటారని అన్నారు.