ఢిల్లీలో అన్ని ఆస్పత్రుల్లో వృద్ధులకు ఉచిత చికిత్స: అర్వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సను అందిస్తామని హామీనిచ్చింది. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ‘సంజీవని యోజన’ కింద 60 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచిత చికిత్సను అందిస్తామని ఆప్ చీఫ్​ అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘‘వృద్ధుల సంరక్షణ మా బాధ్యత.

మీరెంతో కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొచ్చారు. మీకు అందించే చికిత్స ఖర్చుపై గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ మొదలవుతుంది. ఆప్‌‌ కార్యకర్తలే  మీ ఇండ్లకు వచ్చి రిజిస్ట్రేషన్‌‌ చేస్తారు. వాళ్లు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.  మేము అధికారంలోకి రాగానే ఈ ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.