Duleep Trophy 2024: బండబూతు.. పరాగ్‌ను దుర్భాషలాడిన అర్ష్‌దీప్

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. తలపడుతోంది భారత ఆటగాళ్లే అయినప్పటికీ.. ఆడుతున్న తీరు మాత్రం అంతర్జాతీయ పోరును తలపిస్తోంది. అనంతపూర్ వేదికగా ఇండియా-ఏ, ఇండియా-డి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత పేసర్.. తోటి భారత ఆటగాడిపైనే నోరు జారాడు. అవుట్ చేసిన ఆనందంలో అతన్ని దుర్భాషలాడుతూ పెవిలియన్ దారి చూపాడు.

దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌లో భాగంగా  ఇండియా ఏ, ఇండియా -డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇండియా-ఏ 21 పరుగులకే 2 కీలక వికెట్ల కోల్పోయింది. ఓపెనర్లు ప్రథమ్ సింగ్(7), మయాంక్ అగర్వాల్(7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ధాటిగా ఆడటం మొదలు పెట్టాడు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దూకుడు ఇండియా-డి బౌలర్లకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

బ్రేక్ ఇచ్చిన అర్ష్‌దీప్

ధాటిగా ఆడుతున్న పరాగ్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. ఆ సమయంలో నోరు జారాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో చోటుచేసుకుంది. బంతి పరాగ్ బ్యాట్‌ ఎడ్జ్ తీసుకొని నేరుగా స్లిప్‌లో ఉన్న పడిక్కల్ చేతుల్లోకి వెళ్ళింది. వెంటనే భారత పేసర్ కాస్త అగ్రెసివ్‌గా సంబరాలు జరుపుకున్నాడు. అనరాని మాటలతో దుర్భాషలాడాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆటలో ఇవన్నీ సహజమైనప్పటికీ.. భారత ప్లేయర్ తోటి సహచర ఆటగాడిపై ఇలా నోరు పారేసుకోవడం వివాదాస్పదం అవుతోంది.