ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 2 కు పకడ్బందీ ఏర్పాట్లు 

  • ఉమ్మడి మెదక్ జిల్లాలో పరీక్ష రాయనున్న 34,817 మంది అభ్యర్థులు 
  • 94 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • సెంటర్ల వద్ద  పోలీసుల బందోబస్తు 

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : గ్రూప్ -2 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15, 16న జరిగే పరీక్షకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 34,817 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు మొత్తం 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 13,714 మంది అభ్యర్థులు గ్రూప్ - 2 పరీక్షకు  హాజరుకానున్నారు. ఈ మేరకు పట్టణంలో మొత్తం 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు 39 మంది డిపార్ట్​మెంట్ల అధికారులు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు రూట్అధికారులు, 12 మంది ప్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, 576 మంది ఇన్విజిలెటర్లు, 101 మంది బయో మెట్రిక్ ఇన్విజిలెటర్లను నియమించారు.

అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలు కల్పించామని, అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్​ మనుచౌదరి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 3 కిలోమీటర్ల లోపు 163 సెక్షన్ విధించామని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని షాపుల నిర్వాహకులను ఆదేశించారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 15,218 మంది క్యాండిడేట్లు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ మేరకు 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీడబ్ల్యూడీ అభ్యర్థుల కోసం ప్రత్యేక వీల్ చైర్స్ సమకూర్చనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జాయింట్  కస్టోడియన్స్, పోలీస్ నోడల్  ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్,  8 మంది జాయింట్ రూట్ ఆఫీసర్లు, 5 మంది  ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి163సెక్షన్ అమలు చేయనున్నారు.

మెదక్ జిల్లాలో..

మెదక్​జిల్లాలో  మొత్తం 5,885 మంది అభ్యర్థులు గ్రూప్​ -2 పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ నియోజకవర్గంలో 3,769 మంది అభ్యర్థులు ఉండగా 11 పరీక్షా కేంద్రాలు, నర్సాపూర్​ నియోజకవర్గంలో 1,511 మంది అభ్యర్థులు ఉండగా 3 సెంటర్లు, తూప్రాన్​ డివిజన్​లో 575 మంది అభ్యర్థులు ఉండగా 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల సౌకర్యార్థం ఆయా రూట్లలో ఆర్టీసీ అధికారులు స్పెషల్​ బస్సులు ఏర్పాటు చేశారు. కలెక్టర్​ రాహుల్​ రాజ్​, అడిషనల్ కలెక్టర్​ నగేశ్​ పరీక్ష ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఎస్పీ ఉదయ్​ కుమార్ రెడ్డి, అడిషనల్​ఎస్పీ మహేందర్​ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు.