లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్ట్ లో చుక్కెదురైంది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ చెల్లించాల్సిన బకాయిల రికవరీ కోసం ఆ సంస్థను మూసివేయాలన్న ప్రతిపాదనను కర్ణాటక హైకోర్ట్ సమర్ధించింది. అయితే కర్ణాటక తీర్పును సవాల్ చేస్తూ విజయ్ మాల్యా కు చెందిన యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) తరుపున దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం యూబీహెచ్ఎల్ దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. 102 సంవత్సరాల చరిత్ర ఉన్న యూబీని మూసివేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ధృవీకరించింది.
ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ విజయ్ మాల్యా నుంచి ఇప్పటివరకు రూ3,600 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే మాల్యా కు చెందిన యూబీహెచ్ఎల్ నుండి ఇంకా రూ.11వేల కోట్లు రావాల్సి ఉందంటూ సుప్రీం కు తెలిపారు.
ఫిబ్రవరి 2018 కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం యూబీహెచ్ఎల్ తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.7వేల కోట్లు ఉంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 30 న వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన 14వేల కోట్లను యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ తరుపున చెల్లిస్తామని విజయ్ మాల్యా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రూ.3,600కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే నాటి కర్ణాటక తీర్పును సవాల్ చేస్తూ తాజాగా మాల్యా సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. మాల్యా తరుపున సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ కంపెనీ ఆస్తులు మొత్తం రుణాన్ని మించిపోతే చట్టపరంగా సంస్థను మూసివేయాలని లేదంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సంస్థ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిందని కాబట్టే బ్యాంకులకు చెల్లించలేదన్నారు.
