లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ఐదుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: ఓ ఆర్మీ వాహనం లోయలో పడి ఐదుగురు జవాన్లు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‎లోని పూంఛ్ జిల్లా ఘరావ్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలతో కూడిన కాన్వాయ్ పూంఛ్ జిల్లాలోని బనోయ్‎కు వెళుతుండగా.. ఓ వాహనం స్కిడ్ అయి పక్కనే ఉన్న 300 అడుగులో లోయలో పడిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.