భారీ లోయలో పడిపోయిన ఆర్మీ ట్రక్.. ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్: జవాన్లతో వెళ్తోన్న ఆర్మీ ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‎లోని బందిపోరా జిల్లాలో శనివారం (జనవరి 4) ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‎లో ఆసుపత్రికి తరలించారు. 

ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. 
రోజువారీ పెట్రోలింగ్‎లో భాగంగా జవాన్లు వెళ్తుండగా.. బందిపోరా జిల్లాలోని సదర్ కూట్ పాయెన్ ప్రాంతం సమీపంలో మూల మలుపు వద్ద జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తూ అదుపు తప్పి లోయలో పడిపోయిందని తెలిపారు అధికారులు.

ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2024 డిసెంబర్ 24వ తేదీన కూడా జమ్మూలోని పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తోన్న ఆర్మీ వాహనం 350 అడుగుల లోతు లోయలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.