చైనాకు చెక్ పెట్టేందుకు.. ఆర్మీ ఆఫీసర్లకు టిబెటాలజీ క్లాసులు

చైనాకు చెక్ పెట్టేందుకు.. ఆర్మీ ఆఫీసర్లకు టిబెటాలజీ క్లాసులు

టిబెట్ కల్చర్, హిస్టరీపై పీజీ కోర్సులు చెప్పించేందుకు కసరత్తు

న్యూఢిల్లీ: బార్డర్ లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేయాలని మన ఆర్మీ యోచిస్తోంది. టిబెటన్ కల్చర్, హిస్టరీ, లాంగ్వేజ్ వంటివి మన ఆర్మీ ఆఫీసర్లకు తెలియకపోవడంతో ఎల్ఏసీ వెంబడి డ్రాగన్ ఆర్మీని ఎదుర్కోవడం కష్టమవుతోందని, అందుకే మన ఆఫీసర్లకు టిబెటాలజీలో పీజీ క్లాసులు చెప్పించడంపై దృష్టి సారించింది. ఈ ప్రపోజల్ మొదట గతేడాది అక్టోబర్ లో జరిగిన ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ లోనే తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై దృష్టి పెట్టాలంటూ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆదేశించడంతో షిమ్లాలోని ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్ ఈ విషయంపై కసరత్తు షురూ చేసింది. దేశంలో బుద్ధిస్ట్ స్టడీస్, టిబెటాలజీలో ఏడు యూనివర్సిటీలు పీజీ కోర్సులను అందిస్తున్నాయని, ఆర్మీ ఆఫీసర్లకు స్టడీ లీవ్స్ ఇచ్చి ఆ వర్సిటీల్లో చదివేందుకు పంపాలని ఏఆర్టీఆర్ఏసీ యోచిస్తోంది.

చైనా బిహేవియర్ తెలుస్తలే

మన ఆర్మీ ఆఫీసర్లకుపాక్ గురించి అన్ని రకాలుగా అవగాహన ఉంది. కానీ, చైనా, దాని నేచర్ గురించి పెద్దగా ఎక్స్ పర్టైజ్ ఉండకపోవడంతో బార్డర్ లో డ్రాగన్ ను ఎదుర్కోవడం కష్టమవుతోంది. చైనా తీరును బాగా అర్థం చేసుకునే ఆఫీసర్లు మన ఆర్మీలో చాలా కొద్ది మందే ఉన్నారు. టిబెట్ గురించి తెలిసినోళ్లు ఇంకా తక్కువగా ఉంటారు. అందుకే చైనా, టిబెట్ కల్చర్, లాంగ్వేజ్, బిహేవియర్ లను బాగా స్టడీ చేస్తేనే మన ఆర్మీ డ్రాగన్ ఆర్మీకి దీటుగా నిలిచే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

టిబెట్ కార్డ్ ను సరిగ్గ వాడుకుంటలే

ఎల్ఏసీ వెంబడి బార్డర్ కు అటువైపుగా టిబెట్ భూభాగం చాలా కీలకం. టిబెట్ తమ దేశంలో భాగమే అని చైనా చెప్పుకొంటున్నా.. టిబెటన్లు మాత్రం ఇండిపెండెంట్ దేశం కోసం పోరాడుతున్నారు. అయితే టిబెట్ కార్డును మనదేశం బాగా వాడుకుంటే ఎల్ఏసీ వెంబడి టిబెట్ రీజియన్ లో చైనాకు భారీ రెడ్ లైన్ గీసినట్లే అవుతుందని ఎక్స్ పర్టులు చెప్తున్నారు. మనదేశంలో నివసిస్తున్న టిబెటన్లతో ఆర్మీ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల పాంగాంగ్ సో లేక్ నుంచి కైలాస్ రేంజ్ వరకూ ఎత్తైన మౌంటైన్ రేంజ్ లన్నింటినీ చైనా కంటే ముందే ఆక్రమించుకోవడంలో ఈ యూనిట్ జవాన్లే కీలకంగా పనిచేశారు. అందుకే టిబెట్ ను మనవైపు తిప్పుకుని, చైనాకు చెక్ పెట్టాలంటే టిబెటాలజీలో ఆర్మీ ఆఫీసర్లు ఎక్స్ పర్టులు కావాల్సిన అవసరం ఉందని ఆర్మీ ఆఫీసర్లు యోచిస్తున్నారు.