సెల్ ఫోన్ విషయంలో గొడవ..యువకుడి ప్రాణాలు తీసింది

  • మొబైల్ పగిలిందని గొడవ..యువకుడు సూసైడ్
  • సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన
  • గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసుల బందోబస్తు

పుల్కల్, వెలుగు: సెల్ ఫోన్ పగలడంతో తలెత్తిన గొడవ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటకూర్ మండలం లింగంపల్లికి చెందిన మాదిగ రాజు(17), మాదిగ దీపక్(18) పక్క పక్క ఇండ్లలో ఉంటారు.  బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి సైకిల్ పై తమ పొలాలకు వెళ్తుండగా.. రాజు సెల్ ఫోన్ కిందపడి పగిలిపోయింది. తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటూ.. నీ వల్లే ఫోన్ పగిలిపోయిందని దీపక్​తో రాజు గొడవపడి కొట్టాడు. దీపక్ ఇంటికి వెళ్లి రాజు తనను కొట్టినట్టు తాత లింగమయ్యకు చెప్పాడు. అనంతరం తాత, మనవడు ఇద్దరూ కలిసి రాజు ఇంటికి వెళ్లి అతడిని తిట్టడడమే కాకుండా దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో అతని తల్లిదండ్రులు లేకపోవటంతో రాజు భయంతో తాడుతో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.