APSRTC: ప్రయాణికులకు శుభవార్త... బస్సు టికెట్లపై డిస్కౌంట్..!

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ చార్జీలపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. లహరి ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో టికెట్లపై 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ. ఏప్రిల్ 30 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఏపీఎస్ఆర్టీసీ లహరి బస్సులు తిరిగే అన్ని మార్గాలకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది ఏపీఎస్ఆర్టీసీ. తెలంగాణాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ టీడీపీ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాగా, తెలంగాణాలో ఆర్టీసీ కార్పొరేషన్ గానే కొనసాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పట్ల తెలంగాణాలో మిశ్రమ స్పందన వస్తోంది. తమకు ఉపాధి కరువవుతుందని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరి,ఇన్ని ప్రతికూలతల మధ్య ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉంటుందా ఉండదా అన్నది వేచి చూడాలి.